హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరబాద్ నగరం మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్‌పోర్టు మెట్రో వ్యవస్థపైన గురువారం మెట్రోరైల్ భవనంలో మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాలు పలువురు శాఖధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మెట్రో రైల్ మాస్టర్‌ప్లాన్‌పై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. మెట్రో లైన్‌ని భారీగా విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మార్గాలలో వెంటనే అవసరమైన సర్వేలను చేపట్టి ప్రాథమిక రిపోర్టులను , తర్వాత డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్‌లను సిద్దం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని ఆదేశించారు. మరిన్ని కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఫీడర్ సేవలను మెరుగుపరచడంతో పాటు ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయాలన్నారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల కోసం ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మెట్రో స్టేషన్‌లకు సమీపంలోని ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. ఈ సమావేశం ఆనంతరం ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్ళాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ మెట్రో కారిడార్‌కి అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టామని, త్వరలోనే కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. మహాత్మగాంధీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న ప్రస్తుత ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులకు సూచించారు.