కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోతల రాయుడని.. ఆయన చేయలేని పనులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చేసి చూపించాడని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొని మాట్లాడారు. నల్గొండలో ప్రారంభించుకున్న ఐటీ హబ్(IT HUB) అత్యద్భుతమన్నారు. రాష్ట్రంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ హబ్ నిర్మితమైందని, నల్గొండ నగరాన్ని భూపాల్‌రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అతి త్వరలో ప్రారంభం కాబోతుందన్నారు. కవులు కళాకారులకు నెలవు నల్లొండ జిల్లా అని, కళాభారతికి రూ.93కోట్లు నిధులు వచ్చాయన్నారు. ఉదయ సముద్రం, తీగెల వంతెన, వరద నీటి కాలువలు, ఇంకా ఎన్నో పనులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోతలరాయుడని కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆయన చేయలేని పనులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చేసి చూపించాడన్నారు. 24 గంటల విద్యుత్‌ను చెక్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు అందరూ రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త అని.. కాంగ్రెస్ హయాంలో కరెంటు వస్తే వార్త అన్నారు. భారత్‌లో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేది ఒకే ఒక్క నేత కేసీఆర్(CM KCR) మాత్రమేనన్నారు. దామరచర్లలో నిర్మిస్తున్న 4వేల అల్ట్రా మెగాపవర్ ప్రాజెక్ట్‌ను మూసివేస్తాం.. విద్యుత్ ప్రాజెక్టులు వద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్నారు. భూపాల్‌రెడ్డి వైకల్యంపై మాట్లాడినోళ్లకు నెత్తి సరిగా లేదని విమర్శించారు. ఫ్లోరోసిస్‌ను తరిమేసిన మగాడు దేశంలో కేసీఆర్ మాత్రమేనన్నారు. మోదీ సైతం ఒప్పుకున్న నిజం ఇదేనన్నారు.
అంసాల స్వామిని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని(PM Modi) కలిసినా ఫ్లోరోసిస్ సమస్య తీరలేదన్నారు. రైతుబంధు దేశంలో ఇప్పటి వరకు ఏ నాయకుడికి ఆలోచన సైతం రాలేదని, 13లక్షల మంది ఆడపిల్లల పెళ్లిల్లు చేసిన మేన మామ కేసీఆర్ అన్నారు. వృద్ధుల చేతిలో ఊతకర్ర కేసీఆర్ అయ్యిండని.. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ఉందన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉందన్నారు. ప్రధాని రుణమాఫీపై అబద్దాలు చెబుతున్నాడని, రైతు ఆత్మహత్యలను తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. మైనార్టీలను ద్వితీయ శ్రేణి వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని.. తెలంగాణలో పేదరికమే బీఆర్‌ఎస్ (Bharat Rashta Samithi) ప్రభుత్వ గీటురాయన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నమ్మితే 24గంటల కరెంటు పోయి మూడు గంటల కరెంటు వస్తదన్నారు. ఐదేళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులు మారుతారన్న కేటీఆర్ కాంగ్రెస్‌ను నమ్మితే స్కామ్‌లు పెరుగుతాయని.. ముసలి నక్క కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు.