ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) తీవ్రంగా స్పందించారు. బీఆర్‌ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో, ఎమ్‌ఐఎమ్ స్టీరింగ్ అసదుద్దీన్(Asaduddin) చేతిలో ఉందని.. కానీ ప్రధాని స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఐటీ రంగంలో బెంగళూరు తరువాత తెలంగాణ(Telangana)లోనే అధిక ఉద్యోగాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మలక్‌పేటలో ఐటీ న్యూక్లియస్ ఐటీ పార్కు(IT Nucleus IT Park)కు ఎంపీ అసదుద్దీన్, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలతో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 12 ఎకరాల్లో 15 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ టవర్ల నిర్మాణం పూర్తయితే 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మరోవైపు.. ఓల్డ్ సిటీలో యువతకు ఉపాధి కల్పించాలనే తన కల నెరవేరబోతోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(MP Asaduddin Owaisi) ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఐకానిక్ భవనం పాత నగరానికే తలమానికంగా మారుతుందని హర్షం వ్యక్త చేశారు. దీని ద్వారా పాత-కొత్త నగరాల మధ్య అంతరం తొలగిపోతుందని చెప్పారు. యువతకు ఉద్యోగ కల్పన కోసం తాము చేసిన విజ్ఞప్తికి స్పందించి మలక్ పేటలో ఐటీ పార్కు నిర్మాణానికి సహకరించిన మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే బలాలా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. తెలంగాణ అభివృద్ధిపైన ప్రసంగించారు. మూసీనది ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందని.. దాని ఉత్పత్తిలో పంజాబ్, హరియాణాను అధిగమించామని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం (Kaleswaram)పూర్తి చేశామని… దానికి కేంద్రం ఒక్క రుపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో రాష్ట్రంలో తరచూ కర్ఫ్యూ పరిస్థితులుండేవని.. కేసీఆర్ పాలనలో తొమ్మిదేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని కేటీఆర్ చెప్పారు.