కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో అయిదుగురు సీఎంలు, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత మాత్రం గ్యారంటీనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR). ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు(Congress Six Guarantees) అంటోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎవరు అవుతారో తెలియని కాంగ్రెస్.. ఆరు గ్యారంటీ(Telangana Congress Six Guarantees) ఇస్తుందటనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కటిక చీకట్లు, తాగునీటి ఇక్కట్లు, ఎరువులు, విత్తనాల కోసం కష్టాలు గ్యారంటీ అని అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు(Raythu Bandhu)కు, దళితుబంధుకు రాంరాం గ్యారంటీ అన్నారు. ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలని డైలాగులు కొట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఒక అభివృద్ధినైనా ప్రస్తావించిందానని పేర్కొన్నారు. బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
సెప్టెంబరు 17న జాతీయ సమైక్యత దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్రంలో ఉన్న వారికి నచ్చలేదని కేటీఆర్ అన్నారు. మానిన గాయాలను మళ్లీ కదిలించేలా రజాకార్ సినిమాతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రజాకార్, కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ అంటూ భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం, బీజేపీ తొమ్మిదేళ్లుగా దేశానికి, రాష్ట్రానికి అనేక మోసాలు చేసిందని ఆరోపించారు. మోదీ భ్రమల నుంచి ప్రజలు బయట పడుతున్నారన్నారు. కిషన్ రెడ్డికి ధైర్యముంటే 18కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలేమయ్యాయని మోదీ ఇంటివద్ద ధర్నా చేయాలని కేటీఆర్ అన్నారు.
ఖమ్మం రాజకీయాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు డబ్బులిస్తే తీసుకోండి కానీ.. ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని వ్యాఖ్యానించారు. ముల్లును ముల్లుతోనే.. మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు. ఖమ్మంలో కొందరు బీఆర్‌ఎస్‌ను వీడి వెళ్లిపోయారని.. ఫర్వాలేదన్నారు. టికెట్, సీటు దక్కలేదన్న తమ బాధను ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులు అభివృద్ధి ఎందుకు చేయలేదన్నారు. ఖమ్మం జిల్లాలో నాలుగు రకాలుగా చీలిపోయి అభివృద్ధికి దూరం కావద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ రైతుబంధు కావాలో.. కాంగ్రెస్ రాబంధులు కావాలో తేల్చుకోవాలని కోరారు. అతి త్వరలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసి.. కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా చేయాలని ఖమ్మం ప్రజలను కేటీఆర్ కోరారు.