జీహెచ్‌ఎంసీ ఎన్నికల(GHMC Elections) తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ప్రధాని మోదీ(Prime Minister Modi) చేసిన ఆరోపణలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్(Minister KTR) ఖండించారు. కేసీఆర్ ఒక ఫైటర్ అని చీటర్లతో ఎన్నటికీ చేతులు కలపరని స్పష్టం చేశారు. ఎన్డీయేతో చేరాల్సిన ఖర్మ తమకు లేదని తెలిపారు. ఎన్డీయేలో చేరేందుకు తమకు పిచ్చికుక్క కరిచిందా అని ప్రశ్నించారు. అది మునిగిపోయే నావ అని.. ఇప్పటికే అన్ని పార్టీలు వీడిపోతున్నాయని అన్నారు. శివసేన, జేడీయూ, తెలుగుదేశం, శిరోమణి అకాలీదళ్ పార్టీలు వెళ్లిపోయాయని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ తప్ప ఎన్డీయేలో ఎవరు ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఇప్పట్నుంచి ప్రధాని మోదీని ఎవరైనా కలిస్తే.. ఒక వీడియో కెమెరా పెట్టుకుని ఆయనతో మాట్లాడే ప్రతి మాట రికార్డు చేసుకుంటే మంచిదేమో అని తనకు అనిపిస్తుందని విమర్శించారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా ఒకేరకంగా మాట్లాడటం మోదీ(Modi)కి అలవాటు అయిపోయిందని అన్నారు. ‘బెంగాల్ పోతారు.. మమతా బెనర్జీ దేశంలోనే అత్యంత కరెప్టెడ్ చీఫ్ మినిస్టర్ అని మాట్లాడతారు. ఒడిశాకు వస్తారు. నవీన్ పట్నాయక్ దేశంలోనే అత్యంత అవినీతిమయమైన ముఖ్యమంత్రి అని అంటారు.
మేఘాలయ వెళ్తారు.. అక్కడేమో.. మళ్లీ సాంగ్మా దేశంలోనే కరెప్టెడ్ సీఎం అని అంటారు. సరిగ్గా వారం రోజుల తర్వాత ఆయన ప్రమాణస్వీకారంలో ఈయన పార్టీ కూడా చేరుతుంది. ఇద్దరూ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు.’ అని అన్నారు. ప్రధాని మోదీ పచ్చి అబద్దాలకోరు అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని నాలుగైదు ఏండ్ల చిన్న పిల్లలు కూడా నమ్మని పచ్చి అబద్దాలు చెప్పి ఆయన ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధకరం.. శోశనీయమని అన్నారు.