ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుబీమా, రైతుబంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్పించారని తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట (Kotthakota)మండలం సంకిరెడ్డిపల్లి(Sankireddypally) వద్ద నిర్మించనున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రగామిగా ఉందన్నారు.
రాష్ట్రంలో పండిన ధాన్యం కొనమంటే కేంద్రం కొర్రీలు పెడుతున్నదని విమర్శించారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. వేల టన్నుల నూనెను దేశంలోకి దిగుమతి చేసుకునే పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నదని చెప్పారు. 20 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ సాగు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వెల్లడించారు. తద్వారా రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా నూనెలను ఎగుమతి (export) చేయనున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు పెద్దఎత్తున సబ్సిడీ అందిస్తున్నామన్నారు. ఆయిల్‌పామ్ ద్వారా నెలకు ఎకరానికి రూ.12 వేల చొప్పున ఆదాయం సమకూరుతుందని చెప్పారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలతో పంటల సాగులో వెళకువలు తెలుసుకోవాలని సూచించారు. ఊరూరికి ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పాలమూరు రైతన్నలు అద్భుతాలు సృష్టిస్తున్నారని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. పాలమూరు జిల్లాలో నాడు మైగ్రేషన్.. ఇవాళ ఇరిగేషన్ అని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో జిల్లా ముఖచిత్రం మారనుందని చెప్పారు. కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామన్నారు. మళ్లీ గెలిచేది బీఆర్‌ఎసేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.