స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు భద్రత విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ఏ లోపం జరిగినా తాము బాధ్యత వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన ప్రమేయం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో జరగనున్న విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, విజయనగరం ఉత్సవాల నిర్వహణపై మంత్రి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైడితల్లి సిరిమాను జాతర (Piditalli Sirimanu fair) ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, అధికారులు అందరూ సొంత పండుగగా భావించాలని ఆదేశించారు. సిరిమాను జాతర ఆలస్యం కాకుండా ముందుగానే అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్ధిష్ఠ సమయానికే సిరిమాను మొదలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. జైలులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (TDP leader Nara Chandrababu Naidu) భద్రత విషయంపై ప్రశ్నకు స్పందిస్తూ… ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిది.. ఏదైనా లోపం జరిగిన పూర్తి బాధ్యత వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 2005లో జరిగిన వోక్స్ వ్యాగన్ కేసు విషయంలో వచ్చిన ఆరోపణలపై అప్పట్లో సీబీఐ విచారణ జరిపించామని చెప్తూ.. ఆ విచారణలో బాధ్యులపై చర్యలు తీసుకుని నిధులను సైతం రికవరీ చేశామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కూడా చంద్రబాబు తన తప్పు లేదని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.