ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు క్షతగాత్రులకు సహాయం అందించి వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పినపోలు నాగేశ్వరరావు(Pinapolu Nageswara Rao), అతని తమ్ముని కుమారుడు సంజయ్ బైక్ మీద శుక్రవారం మధ్యాహ్నం విశాఖ వైపు వెళ్తున్నారు.
అయితే, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న వెహికిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అల్యూమినియం రైలింగ్ ని ఢీ కొట్టింది.. దీంతో కింద పడటంతో వీరిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నాగేశ్వరరావుకు తలతో సహా పలు చోట్ల గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అలాగే సంజయ్ అనే బాలుడు సుమారు 10 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడికి కూడా తీవ్ర రక్తస్రావంతో రోడ్డు మీద పడి ఉన్నారు.
ఇదే టైంలో మంత్రి అమర్నాథ్(Gudivada Amarnath) అనకాపల్లి (Anakapalli) నియోజకవర్గంలో కార్యక్రమాలు ముగించుకుని విశాఖపట్నం వస్తుండగా.. రోడ్డు పక్కన రక్తమోడుతూ కనిపించిన వీరిద్దరిని చూసి.. వాహనం దిగి వెంటనే తన కాన్వాయ్ లో ఉన్న ఒక వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, పోలీసుల సహాయంతో వారిని లంకెలపాలెం సీహెచ్సీకి తరలించారు. గాయపడిన ఇద్దరికి లంకెలపాలెం సీహెచ్సీలో ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడి నుంచి రెండు అంబులెన్స్ లను కూడా ఆసుపత్రికి పంపించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంకు పంపించాలని వైద్యాధికారులను మంత్రి గుడివాడ అమర్నాథ్(Mantri Gudivada Amarnath) ఆదేశించారు. తీవ్ర గాయాలైన నాగేశ్వరరావు, సంజయ్ ప్రస్తుతం విశాఖ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు.