ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక, సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాగా, ఈరోజు అసెంబ్లీలో మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ క్రమంలో మహిళ సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ పేదింటి ఆడబిడ్డకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారు. ప్రతీ ఆడబిడ్డ కష్టాలు సీఎం జగన్ తీర్చుతున్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం చేసిన కృషిని చూసి మహిళలందరూ జయహో జగన్ అంటున్నారు. చంద్రబాబు 40 ఏళ్లలో మహిళల కోసం చేయలేనిది సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారు. సీఎం జగన్ మనసున్న నాయకుడు.
చంద్రబాబు 14 ఏళల్లో మహిళల కోసం ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఆడపుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు అని సీరియస్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నారు. చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు. చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలని మహిళలకు తెలుసు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏపీలో మహిళలకు రాజకీయంగా సీఎం జగన్ అవకాశాలు కల్పించారు.రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదు.. పనికిమాలిన పార్టీ. చంద్రబాబు చీటర్.. ముఖ్యమంత్రి జగన్ లీడర్. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొన్న తొడగొట్టారు.. ఇవాళ తోక ముడిచారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. సీఎం జగన్ సంక్షేమ పథకాలపై బాలకృష్ణ చర్చకు రాగలరా?. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమనే సునామీ దెబ్బకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ సముద్రపు అలల్లో కొట్టుకుపోతారని ఎద్దేవా చేశారు.