రాజకుటుంబంతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్ దంపతులు విడాకులపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో మేఘన్ మార్కెల్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయ్యింది. ఇటీవల 42వ పుట్టిన రోజు జరుపుకున్న మోర్కెల్.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి దిగిన ఫోటోపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఫోటోలో మోర్కెల్ చేతికి నిశ్చితార్ధ ఉంగరం లేకపోవడంతో విడాకులు తీసుకుంటారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
విడాకులపై రూమర్లు వినిపిస్తున్న తరుణంలో మార్కెల్‌కు ఎంగేజ్‌మెంట్ బ్యాండ్ వేలికి ఉండగా.. ఉంగరం మాత్రం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. తన హెయిర్‌స్టైలిస్ట్ మికా హ్యారిస్, రచయిత క్లియో వేడ్‌తో దిగిన ఫోటోను మార్కెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘పుట్టినరోజు సందర్భంగా హెయిర్ స్టైలిస్ట్ మికా హ్యారిస్, రచయిత్రి వేడ్‌తో కలిసి దిగిన కొత్త స్వీట్ ఫోటో’ అని రాశారు.
మార్కెల్ చేతికి ఉంగరం లేకపోవడంతో అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఎంగేజ్‌మెంట్ రింగ్‌కి ఏమైందో ఆశ్చర్యంగా ఉంది’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. అయితే, నిశ్చితార్థ ఉంగరాలను ఎప్పుడూ చేతికి ఉంచుకోవాల్సిన అవసరం ఏముందని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే, ఈ నిశ్చితార్ధం ఉంగరానికి సెంటిమెంట్ పరంగా ఓ ప్రత్యేకత ఉంది. హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానా సేకరించిన ఆభరణాల్లోని విలువైన బోట్స్‌వానా వజ్రంతో ఉంగరాన్ని తయారు చేశారు.
అయితే, మార్కెల్ నిశ్చితార్థపు ఉంగరం ధరించకపోవడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబరు 2019లో హ్యారీ దంపతులు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా దానిని ధరించకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే, మొదటిసారి గర్బం దాల్చినప్పుడు కూడా ఈ ఉంగరాన్ని తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు ఆమె ధరించలేదు.
అయితే, భార్య మేఘన్ కోసం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వారసుడిగా గుర్తింపుతో పాటు రాచరిక హోదాను ప్రిన్స్ హ్యారీ వదులుకున్న విషయం తెలిసిందే. ఆయన తన భార్య, పిల్లలతో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నారు. రాజకుటుంబ బాధ్యతలను వదులుకుంటున్న మూడేళ్ల కిందట ప్రిన్స్ హ్యారీ చేసిన ప్రకటనతో యావత్తు ప్రపంచం విస్తుపోయింది. బ్రిటీష్ మీడియా పెట్టే మానసిక హింస తట్టుకోలేకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తర్వాత వెల్లడించారు. రాచరికం కట్టుబాట్లు, విలాసాలు తమకు ఓ గుదిబండలా మారాయనీ, రాజరిక జీవితం ఒత్తిడిని భరించలేకపోయానని ఆయన వెల్లడించారు.