మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు 11 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులుగా మారిన విషయం తెల్సిందే. జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక నేడు మెగా ప్రిన్సెస్ కు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఉపాసన తల్లి గారింట ఈ వేడుకను నిర్వహించారు. తాజాగా మనవరాలి పేరును చిరు.. అధికారికంగా అభిమానులతో పంచుకున్నాడు. మెగా ప్రిన్సెస్ పేరు.. ‘క్లిన్ కారా కొణిదెల’ గా చెప్పుకొచ్చాడు. ఇక ఆ పేరును ఎలా పెట్టారో కూడా చిరు చెప్పుకొచ్చాడు.
ట్విట్టర్ వేదికగా చిన్నారిని క్లాత్ ఉయ్యాల్లో పడుకోబెట్టిన ఫోటోను షేర్ చేస్తూ.. ” ఇక పాప పేరును క్లిన్ కారా కొణిదెల గా నామకరణం చేశాం. లలితా సహస్రనామ నామం నుండి ఈ పేరును తీసుకున్నాం. ‘క్లిన్ కారా’ ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది.. దివ్యమైన తల్లి ‘శక్తి’ యొక్క అత్యున్నత శక్తిని నిక్షిప్తం చేస్తుంది. దానికి శక్తివంతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ లక్షణాలు అన్ని లిటిల్ ప్రిన్సెస్ తన వ్యక్తిత్వంలో వస్తాయని .. ఆమె పెరిగేకొద్దీ తనలో ఇముడ్చుకుంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఆ ఆపేరు మమ్మల్ని మంత్రం ముగ్దుల్ని చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక పేరు చాలా బావుందని మెగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే, మరోవైపు చరణ్-ఉప్సీ దంపతుల పాప కోసం ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ఇటీవల బంగారు ఊయలను కానుకగా పంపించారని.. అందులోనే పాపకు వేడుకలు చేయనున్నారని గురువారం నుంచి జోరుగా ప్రచారం సాగుతుంది. కాగా, ఈ వార్తలపై తాజాగా చరణ్ టీమ్ స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనని చెప్పింది. ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు సిద్ధం చేసిన చెక్క ఉయ్యాలనే ఈ వేడుకల్లో ఉపయోగించినట్లు తెలిపింది.
ఇక ప్రజ్వల సంస్థ వారు సిద్ధం చేసిన ఊయలను ఇటీవల ఉపాసనా ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకున్న విషయం తెలిసిందే. ‘‘ప్రజ్వల ఫౌండేషన్ నుంచి ఇలాంటి హృదయపూర్వక బహుమతి పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది. చేతితో తయారు చేసిన ఈ ఉయ్యాలకు ప్రాముఖ్యత ఉంది. బలం, ఆశకు ఇది ప్రతీక. పరివర్తన, ఆత్మగౌరవాన్ని ఇది సూచిస్తుంది. నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఈ విలువలు కలిగి ఉండాలని కోరుకుంటున్నా’’ అని అప్పట్లో ఆమె పోస్ట్ పెట్టారు.