బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ప్రకటించిన ఏడు స్థానాల్లో ప్రస్తుతం నాలుగు అధికార బీజేపీ, మిగిలిన మూడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. తొలి జాబితాలోని అభ్యర్థుల పేర్లు: మొరెనా జిల్లాలోని డిమాని నుంచి పార్టీ మాజీ ఎమ్మెల్యే బల్వీర్ సింగ్ దండోటిత. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 2 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. రేవా జిల్లాలోని సెమారియా స్థానం నుంచి పంకజ్ శర్మ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అవదేశ్ ప్రతాప్ సింగ్ రాథోడ్, రామరాజా పాఠక్ వరుసగా నివారి, రాజ్‌నగర్-ఛతర్‌పూర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. మిగిలిన ముగ్గురు అభ్యర్థులు – దేవ్‌రాజ్ అహిర్వార్ రైగాన్ స్థానం నుంచి, మణిరాజ్ సింగ్ పటేల్ రామ్‌పూర్ బఘేలాన్ స్థానం నుంచి, విష్ణు దేవ్ పాండే సిర్మూర్ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. మణిరాజ్ సింగ్ పటేల్ రిటైర్డ్ నాయబ్ తహసీల్దార్ కాగా.. సిర్మూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి విష్ణు దేవ్ పాండే మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావడం గమనార్హం.
మధ్యప్రదేశ్‌లో వింధ్య, గ్వాలియర్, చంబల్, బుందేల్‌ఖండ్‌లతో సహా ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు పరిమితమైన బీఎస్పీ, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 9 శాతం ఓట్లతో ఏడు స్థానాలను గెలుచుకుంది. ఐదేళ్ల తర్వాత ఆ సంఖ్య 6.20 శాతం ఓట్లతో కేవలం నాలుగు సీట్లకు పడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 5.01 శాతం ఓట్లతో కేవలం 2 సీట్లకు పరిమితమైంది. ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలలో ఒకరైన సంజీవ్ సింగ్ గత ఏడాది జూలైలో తన పాత పార్టీ అయిన బీజేపీలో చేరారు. రాష్ట్రంలో పార్టీకి ఇప్పుడు ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని పఠారియా స్థానం నుండి మొదటిసారి శాసనసభ్యుడు అయిన రాంబాయి తాలూర్ ప్రస్తుతం బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు.