అండమాన్ నికోబార్ దీవులు
ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపు అలలపై ప్రయాణిస్తూ.. ప్రకృతి రమణీయ దృశ్యాలను చూడాలని కోరుకొని వారు ఎవరైనా ఉంటారా? సముద్రం తీరంలో, దాని లోపలా సరదాగా గడపటం గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. ఈ అనుభూతిని పొందాలంటే కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబర్ దీవులకు వెళ్లాల్సిందే. చూడటానికి దూరంగా వెలివేసినట్టు ఉన్నప్పటికీ దేశ అంతర్భాగంలో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా ఉన్న ఈ దీవుల విశేషాలు..
1777వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు జరిపిన సర్వేలో బయటపడిన ఈ ద్వీపం.. ఆ తరువాత వారి రాజకీయ అవసరాల కోసం, ఖైదీలను ఉంచడం కోసం ఈ ప్రాంతాన్ని మార్చేసారు.
అండమాన్‌లో సెల్యులర్ జైలును చూడడం, లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రామ్ లో జైలు చరిత్ర, ఖైదీల ఆర్తనాదాలు భయానక వాతావరణాన్ని కలిగిస్తాయి. వందలాది ఖైదీలను బంధించి, చిత్రహింసలు పెట్టి, ఉరితీసిన భయంకరమైన ఆ జైలు సందర్శనం ఒంటిని జలదరింపచేస్తుంది. ఖైదీలను ఏ విధంగా హింసించేవారో చూపించే బొమ్మలు వున్నాయక్కడ. వీరసావర్కార్ గది. ఆవరణలో ఓ పెద్ద రావిచెట్టు ఉంటుంది, ఈ జైలులో జరిగిన అకృత్యాలకు మౌనసాక్షి అదే.
ఇక్కడి హావ్లాక్ ద్వీపం స్కూబా డైవింగ్ కు బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ స్కూబా డైవింగ్ జీవితంలో ఒక మధురానుభూతిని మిగిలుస్తుంది. సముద్ర గర్భంలో దాగిన అద్భుతాలు, ఎన్నో రంగు రంగుల చేపల గుంపులు చుట్టుముడుతుంటే.. నాచుపట్టిన పచ్చని బండరాళ్లు ఉప్పునీటిలో కొండకోనలను తలపిస్తాయి.
ఇక ఇక్కడి విజయనగర్ బీచ్ తీరం వెంబడి కొబ్బరిచెట్లు హాయిగా ఊగుతూ మాకోసమే ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తాయి. చల్లగా వీచే గాలితోపాటు, నీలి రంగులో కనిపించే సముద్రపు నీరు సమయాన్ని మరిచేపోయేలా చేసి.. ఇక్కడి ప్రశాంతత ఎక్కడ దొరకదు ఏమో అనే అంత హాయిని కలుగచేస్తుంది.
అందాలకు, ఆనందాలకు నెలవైన ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోని పర్యాటక ప్రాంతాలలో వాటర్ స్కైయింగ్, వాటర్ స్కూటర్, పారా సైలింగ్, విండ్ సర్ఫింగ్, సెయిలింగ్, స్పీడ్ బోటింగ్, రోయింగ్, పాడిల్ బోటింగ్, కయాకింగ్, ఆక్వా సైక్లింగ్, ఆక్వా గ్లైడింగ్, బంపర్ బోట్సు లాంటి సాహసోపేతమైన క్రీడలను సైతం నిర్వహిస్తారు.
ఈ దేవుల రాజధాని అయినా పోర్టు బ్లెయిర్ లో ఉన్న ఆబర్డీన్ బజార్ షాపింగులకు అనువైనది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి.
ఇంకా ఇక్కడి వైపర్ దీవి జైలుకు ప్రసిద్ధి గాంచినది. ఈ ప్రదేశంలో ఒళ్ళు గగుర్పొడిచే సంఖ్యలో వైపర్ పాములు ఉండటంచే వైపర్ దీవి అని పేరు వచ్చిందంటారు. భారతదేశ స్వాతంత్ర పోరాట యోధులలోని ప్రముఖులు వారి చివరి దినాలను ఇక్కడి వైపర్ జైలులో గడిపారు. నేటికి ఈ జైలు అవశేషాలు పర్యాటకులు చూడవచ్చు.
ఇవే కాక, ఇక్కడ ఎలిఫెంట్ బీచ్, రాధనగర్ బీచ్, మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్, మహాత్మ గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, లక్ష్మణపూర్ బీచ్, బర్రెన్ ఐలాండ్స్, బరాజ్ ద్వీపం వంటి అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు.