ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ కంపెనీల బాస్ ఎలాన్ మస్క్.. ఫేస్‌బుక్, మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు దీనిపై మరో కీలక ప్రకటన చేశారు మస్క్. ఈ ఫైట్ లైవ్ స్ట్రీమింగ్ కానుందని ట్వీట్ చేశారు. ‘జుకర్, మస్క్ మధ్య జరిగే ఫైట్ ఎక్స్‌లో (ట్విట్టర్) లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక దీని ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళ్తాయి.’ అని ట్వీట్ చేశారు మస్క్. ఇంకా మరోవైపు మార్క్ జుకర్ బర్గ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఇద్దరు కుబేరులు, వ్యాపారవేత్తల నడుమ కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. పాలిటిక్స్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి కూడా చాలా విషయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు జుకర్, మస్క్. ఇక ఇటీవల ఇవి తారస్థాయికి చేరాయి కూడా. మస్క్ ట్విట్టర్‌కు (X) పోటీగా.. మెటా థ్రెడ్స్ అనే యాప్ లాంఛ్ చేసింది. దీనిపై మస్క్ విమర్శలు చేశారు. తన ఎక్స్‌ను కాపీ కొట్టి థ్రెడ్స్ డిజైన్ చేశారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే జుకర్‌బర్గ్ రెడీ అంటే ఆయనతో కేజ్ ఫైట్‌కు తాను సిద్ధమని తొలుత మస్క్ ట్వీట్ చేశారు. దీనిపై ప్లేస్ ఎక్కడో చెప్పాలంటూ.. సవాల్‌కు సై అన్నారు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్. దీనికి బదులిచ్చిన మస్క్.. వెగాస్ ఆక్టాగాన్ దగ్గరికి రా చూసుకుందాం అంటూ రెచ్చగొట్టారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కేజ్ ఫైట్‌లో తలపడబోతున్నారంటూ ప్రచారం స్టార్ట్ అయింది. ఇదంతా కేవలం ప్రచారం కోసమేనని తొలుత చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు అది నిజమనే విషయాన్ని అందరూ అర్ధం చేసుకున్నారు. యితే ఈ ఫైట్ ఎప్పుడు ఉంటుందనే దానిపై ఎలాంటి ప్రకటనా రాలేదు.