అది 2000వ సంవత్సరం. ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ నష్టాల్లో మునిగిపోనుందనీ, ఇక ఉత్పత్తిని ఆపేయాలని క్షేత్రస్థాయి కమిటీ ఓనర్ విక్రమ్ లాల్‌కు ఓ నివేదిక పంపింది. సరిగ్గా అప్పుడే ఆయన తనయుడు సిద్దార్థ్ రంగంలోకి దిగారు. కొద్దిగా సమయం ఇవ్వాలని తండ్రిని కోరి వాస్తవాలు తెలుసుకోవటం మొదలు పెట్టారు. 2022 డిసెంబర్ చివరి నాటికి దేశంలోనే దమ్మున్న బ్రాండ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ నిలిచింది. 22 ఏళ్ల ఈ ప్రయాణం సాగిన తీరు ఇదీ..
2000లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవోగా బాధ్యతలు, 2006 నాటికి ఐషర్ సీఈవో, ఎండీగా బాధ్యతలు తీసుకున్నారు. ఆఫీసులో కూర్చుంటే యూత్ నాడి పట్టలేమని, దేశమంతా తిరిగి బైక్‌ల విషయంలో యూత్ ఛాయిస్ తెలుసుకున్నారు. తిరిగి రాగానే బ్రాండింగ్‌ను పునరుద్ధరించటంతో బాటు బైక్ పనితీరును మెరుగుపరచటం మీద దృష్టి పెట్టారు. ‘లెస్ ఈజ్ మోర్’ అనే ఫిలాసఫీ ప్రకారం.. మీడియం ధరకు బైక్‌ను అందిస్తూ.. ప్రొడక్షన్ మాత్రం పెంచకుండా మార్కెట్‌లో బుల్లెట్‌కు డిమాండ్‌ను పెంచారు.
బుల్లెట్ 350, క్లాసిక్ 350 మోడళ్ల సక్సెస్, ట్విన్ సిలిండర్ ఇంజన్‌కు రైడర్లు ఫిదా కావటంతో కంపెనీ విలువ పెరుగుతూ పోయింది.
2008లో ఐషర్‌లోని 46 శాతం వాటాను వోల్వోకు అమ్మి, తమ15 కుటుంబ వ్యాపారాల్లో 13ని అమ్మేసి, టైం అంతా ఎన్‌ఫీల్డ్‌కే కేటాయించారు. 2014 నాటికి ఐషర్ గ్రూపు ఆదాయంలో ఏకంగా 80శాతం వాటా రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచే రావటం మొదలైంది.
2015లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బాధ్యతలను వదిలి, ఐషర్ గ్రూప్ ఎండీ, సీఈవోగా కొనసాగుతూ, లండన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. 2022 డిసెంబరు త్రైమాసికానికి రూ. 714 కోట్ల లాభంతో బాటు 8,34,895 బైక్‌లను విక్రయించి సేల్స్ రికార్డులను తిరగరాసింది. 2022 ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. కుటుంబ సంపద రూ. 54 వేల కోట్లు కాగా ఇందులో సిద్ధార్థ్ వాటా రూ. 37 వేల కోట్లు.
ఇక.. కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ.. రూ. 80 వేల కోట్లుగా తేలింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా ఉత్పత్తిని కొనసాగిస్తున్న ఏకైక బ్రాండ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ నిలవటం విశేషం.