ఒడిస్సా రైలు ప్రమాద ఘటన మరువక ముందే శనివారం మరో ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. తమిళనాడులోని చెన్నై సమీపంలో మధురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న టూరిస్ట్ రైలులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందారు. దాదాపు 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి రామేశ్వరానికి ఆధ్యాత్మిక యాత్ర కోసం వచ్చిన టూరిస్ట్ రైలు.. చెన్నై సమీపంలోని మధురై రైల్వే స్టేషన్లో ఆగి ఉంది. ఈ క్రమంలో ప్రైవేట్ పార్టీ కోచ్‌లోని ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయని దక్షిణ రైల్వే తెలిపింది. ఆ మంటలు వెంటనే రైలులోని రెండు కోచ్‌లకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.