తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో(Telangana Elections 2023) పోటీ చేసేందుకు బీసీలకు సీట్లు కేటాయింపు విషయమై ఏఐసీసీ పెద్దలను కలవాలని బీసీ నాయకులు నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ(Campaign Committee Chairman Madhuyaskhi) వెల్లడించారు. ఇవాళ గాంధీభవన్‌లో జరిగిన బీసీ నేతల సమావేశంలో.. పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతురావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉన్న దగ్గర.. గెలుపునకు అవకాశం ఉన్న నియోజక వర్గాలల్లో ప్రాధాన్యత కల్పించి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు బీఆర్‌ఎస్ పార్టీ 23 సీట్లు ఇచ్చిందన్న మధుయాస్కీ.. కాంగ్రెస్‌లో బీసీలకు న్యాయం జరుగుతుందని స్వయాన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజల్లో మంచి స్పందన వచ్చినట్లు వివరించారు. మహిళ బిల్లుతో పాటు ఓబీసీ బిల్లు(OBC Bill) కూడా పెట్టాలని రాహుల్ డిమాండ్ చేశారన్నారు.
తెలంగాణలో మార్పు రావాలంటే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్(Congress Government) ఏర్పాటు అవుతుందని, బహుజనుల పాత్ర ఏమిటి అని అడుగుతున్నామని తెలిపారు. పీసీసీ చెప్పినట్లుగా 34 సీట్లయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సర్వేలు చూపించి బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ, సీఎల్పీ నేతలు కూడా గతంలో ఓడిపోయారని మధుయాస్కీ వ్యాఖ్యానించారు. దీని కోసం రేపు దిల్లీకి వెళ్లి ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖర్గేలను కలుస్తానన్నారు. అదేవిధంగా సోనియా, రాహుల్‌ను కూడా కలుస్తామని మధుయాస్కీ తెలిపారు.
‘బీసీలకు బీఆర్ఎస్ 23 సీట్లు ఇచ్చింది. బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని రేవంత్ చెప్పారు. పీసీసీ చెప్పినట్లు బీసీలకు 34 సీట్లయినా ఇవ్వాలి. తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలని చెప్పాం. 6 గ్యారంటీ పథకాలతో ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా అమలు చేయాలి. బీసీగా చెప్పుకునే మోదీ ఓబీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఓబీసీ బిల్లు కూడా పెట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. బీసీల పాత్ర లేకుండా ఏ ప్రభుత్వ ఏర్పాటు జరగదు. సర్వేలు చూపించి బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉంది.’ -మధుయాస్కీ, కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్