దేశరాజధాని ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీపై నియంత్రణ కోసం తెచ్చిన జాతీయ రాజధాని ప్రాంత బిల్లు -2023లోక్‌సభ ఆమోదం పొందింది. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినట్లు ప్రతిపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. బిల్లుపై ఓటింగ్ సమయంలో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసమే ఢిల్లీ సర్వీసుల బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. ఢిల్లీ సేవలు ఎప్పటికీ కేంద్రంతోనే ముడిపడి ఉన్నాయన్నారు.
లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఢిల్లీకి ‘పూర్తి రాష్ట్ర హోదా’ ఇస్తామని బీజేపీ గతంలోనే హామీ ఇచ్చిందని అన్నారు. బదిలీ పోస్టింగ్‌లపై రాష్ట్ర నియంత్రణను తీసివేసే బిల్లుపై నిరాశను వ్యక్తం చేసిన కేజ్రీవాల్, “ఈ రోజు, ఈ వ్యక్తులు (బిజెపి) ఢిల్లీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు” అని అన్నారు. ‘ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని బీజేపీ పదే పదే హామీ ఇచ్చింది. 2014లో మోదీ స్వయంగా ప్రధాని అయ్యాక ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఢిల్లీ ప్రజల వెన్నుపోటు పొడిచారు. ఇక నుంచి మోదీ జీని నమ్మొద్దు’’ అని అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ (గతంలో ట్విటర్‌గా పిలిచేవారు)లో పేర్కొన్నారు.
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలు అన్ని పక్షాలు పాల్గొన్నాయి. ఢిల్లీ ఆర్డినెన్సు బిల్‌పై చర్చ సందర్భంగా ఆప్ ఎంపి సుశీల్ కుమార్ రింక్ వెల్‌లోకి దూసుకెళ్లి బిల్ పేపర్లను చింపి స్పీకర్ టేబుల్‌పైకి విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. స్పీకర్ టేబుల్ పై కాగితాలు విసిరేసి, సభాగౌరవానికి భంగం కలిగించినందుకు ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింక్‌ను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు సభ కార్యక్రమాలకు హాజరుకాకుండా రింకు ను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. చర్చ అనంతరం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభకు సమాధానం ఇచ్చారు. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్‌లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును హోంమంత్రి అమిత్ షా సమర్థించారు.”ఈ ఆర్డినెన్స్ జాతీయ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఏదైనా అంశంపై చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉందని సుప్రీం కోర్టు ఆదేశాన్ని సూచిస్తుంది. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయి” అని ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు- 2023ని ప్రస్తావిస్తూ అమిత్ షా అన్నారు.