తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకం మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలో అవకాశం కల్పించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పదో తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులను రెండోవిడతలో పరిశీలించాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపికచేస్తారు. జిల్లా మంత్రి ఆమోదంతో లబ్ధిదారుల జాబితాను సిద్ధంచేస్తారు. కొన్ని జిల్లాల్లో 15వ తేదీలోగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతుండగా, ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సొంత స్థలం ఉండి పక్కాగృహం లేని బలహీనవర్గాల కుటుంబాలు గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రూ.3 లక్షల నగదును లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లో మూడు విడతల్లో జమ చేయాలని నిర్ణయించింది. దరఖాస్తుల సమర్పణకు కేవలం మూడు రోజులే గడువు ఇవ్వడం అందరిలో అనుమానాలను రేకెత్తిస్తోంది. దరఖాస్తుకు ఏ పత్రాలు జత చేయాలో తెలుసుకునేందుకు సంబంధీకులు కార్యాలయాలకు తరలివచ్చారు. మూడు రోజుల్లో ఒకరోజు ముగిసిపోయింది. ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ఆయాపత్రాల సేకరణకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. కుల, వార్షికాదాయ వివరాలను అడగడం.. ఇళ్ల కేటాయింపుల్లో కులాల వారీగా రిజర్వేషన్లు ఉండటంతో ఆ పత్రాలు లేనివారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.