2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఆస్టియో ఆర్ధరైటిస్ బారినపడతారని లాన్సెట్ అధ్యయనం బాంబు పేల్చింది. ఆస్టియో ఆర్ధరైటిస్ కీళ్లు క్షీణించడం ద్వారా జాయింట్స్ చివర ఉండే ఎముకలను కాపాడే కణజాలమైన మృదులాస్ధిని దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి ముదిరితే జాయింట్స్ చుట్టూ ఎముక బలహీనం కావడంతో పాటు ఇన్‌ప్లమేషన్ కూడా ఏర్పడుతుంది.
గతంలో ఆస్టియో ఆర్ధరైటిస్ వృద్ధుల్లో మాత్రమే కనిపించినా ప్రస్తుతం 30 ఏండ్లు పైబడిన వారు సైతం దీని బారినపడుతున్నారు. నగరీకరణ పెరగడంతో పాటు శారీరక వ్యాయామం తగ్గడం, జంక్‌ఫుడ్, జీవనశైలి వంటి కారణాలతో కండరాలు, జాయింట్స్ దెబ్బతినడం వంటి కారణాలతో ఆస్టియో ఆర్ధరైటిస్ కేసులు పెరుగుతున్నాయని ప్రముఖ ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ బీఎస్ మూర్తి చెబుతున్నారు. ఊబకాయంతో జాయింట్స్‌పై ఒత్తిడి పెరగుతుండగా, మృదులాస్ధి (కార్టిలేజ్) దెబ్బతింటోందని చెప్పారు.
వయసు మీదపడటం వల్ల కూడా సహజంగా ఆస్టియో ఆర్ధరైటిస్ ముప్పు పెరుగుతుందని చెప్పారు. సకాలంలో వైద్య సాయం పొందకపోవడం, కండరాలు, ఎముకల ఆరోగ్యంపై అవగాహన లేకపోవడంతో కూడా వ్యాధి ముదురుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వయో వృద్ధుల్లో దెబ్బతినే అవయవాలను గుర్తించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, ఆస్టియో ఆర్ధరైటిస్‌తో కీళ్లు, మోకాళ్లు, తొడలు, చేతుల వంటి అవయవాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని బెంగళూర్‌లోని నారాయణ హెల్త్ సిటీ ఆర్ధోస్కోపిక్ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రశాంత్ తేజస్విని చెబుతున్నారు.