పీరియడ్స్ సమయంలో చాలామంది శారీరకంగానే కాదు మానసికంగా కూడా నీరసంగా ఉంటారు. ఆ సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు శారీరకంగా, మానసికంగా కూడా ధృడంగా ఉంటారు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పీరియడ్స్ సమయంలో దాదాపు ప్రతి అమ్మాయి ఎమోషనల్ రోలర్‌కోస్టర్ అనుభవిస్తుంది. నెలసరి సమయంలో కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల చేసే పనులపై ఆసక్తి అంతగా చూపించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు.
నెలసరి సమయంలో సమయంలో చాలామంది స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఆ సమయంలో అధిక చక్కెర కలిగిన ఫుడ్స్, శుద్ధి చేసిన (రిఫైన్డ్) కార్బోహైడ్రేట్‌లను తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర పెరుగుదలకు దారి తీయవచ్చు. ఇది మీరు మానసిక స్థితిపై అధిక ప్రభావం చూపిస్తుంది. మీకు స్వీట్స్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటే స్వీట్స్ కు బదులుగా తృణధాన్యాలు, చిక్కుళ్లు, కూరగాయలు తీసుకోండి. ఇవి మీకు స్వీట్స్ క్రేవింగ్స్ తగ్గించి.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. సెరోటినిన్ మానసిక స్థితిని ప్రభావితం చేసే న్యూరోట్రాన్స్మిటర్. ఋతుస్రావం సమయంలో ఇది శరీరంలో చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడే అమినో యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చు. చికెన్, గుడ్లు, నట్స్, స్ప్రౌట్స్ వంటివి సెరోటినిన్ ఉత్పత్తికి సహాయం చేస్తాయి.
మెగ్నీషియం మానసిక కల్లోలం, ఆందోళనను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే పీరియడ్స్ సమయంలో ఆకుకూరలు, బాదం, జీడిపప్పులు, గుమ్మడికాయ, సన్ ఫ్లవర్ విత్తనాలు తీసుకోవచ్చు. చిక్కుళ్లు, తృణధాన్యాలు కూడా మెగ్నీషియం అధికంగా కలిగి ఉంటాయి. B-విటమిన్లు.. ముఖ్యంగా విటమిన్ B6 మానసిక స్థితిని అదుపులో ఉంచుతుంది. నిరాశ, చిరాకు లక్షణాలను తగ్గిస్తుంది. కాబట్టి చేపలు, గుడ్లు, ఆకు కూరలు, బీన్స్ తరచుగా తీసుకుంటే మంచిది.