తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేస్తారా? లేదా? అనే ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెర దించారు. గ్రూప్-2 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. టీఎస్పీఎస్సీతో సంప్రదించి గ్రూప్-2 రీషెడ్యూల్ చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గురుకుల టీచర్, జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ తదితర 21 పోటీ పరీక్షలు ఒకే నెలలో ఉన్నాయని, గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని టీఎస్‌పీఎస్సీని కోరితే పట్టించుకోలేదంటూ డి.మహేశ్‌తోపాటు మరో 149 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ పి.మాధవి దేవి శుక్రవారం విచారణ చేపట్టారు. అయితే.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ. గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు.. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిపై సోమవారంలోగా తేల్చాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఇచ్చిన వినతి పత్రంపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది హైకోర్టు. కోర్టుకు 5 లక్షల మంది రాలేరని, వచ్చింది కొంత మందే అయినా వారి హక్కులను పరిరక్షించాల్సిందేనని వ్యాఖ్యానించింది హైకోర్టు. 14వ తేదీ లోపు ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది హైకోర్టు.