షికాగో ఫుడ్ స్టాప్ తరహాలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ ఆహార ఉత్పత్తుల్లో సృజనాత్మకత, ప్రజల అలవాట్లు, చరిత్రను భద్రపరిచేలా ఫుడ్ స్టాప్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా పలు సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఆదివారం షికాగో నగరంలో ‘షికాగో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకో సిస్టం’ ను అధ్యయనం చేశారు. అక్కడ నెలకొల్పిన ఫుడ్ స్టాప్‌ను పరిశీలించారు. షికాగో నగర సంప్రదాయ ఆహార అలవాట్లు, ఉత్పత్తుల సరఫరా వంటి అంశాలను కాపాడుకోవడంలో.. ఈ ఫుడ్ స్టాప్ అగ్రస్థానంలో ఉందని సంస్థకు సంబంధించిన ప్రతినిధులు తెలిపారు. ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తూనే మా సంప్రదాయ అలవాట్లను జోడిస్తామని.. వాటిపై ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకునే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక జీవితంలో అత్యంత కీలకమైన ఆహార ఉత్పత్తులు, శుద్ధి పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు.. అవసరమైన వ్యవస్థను.. నెలకొల్పినట్లు వివరించారు.
అనంతరం వరల్డ్ బిజినెస్ షికాగో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘ఆహారంలో సృజనాత్మకత’ అనే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఆహార శుద్ధి పరిశ్రమ రంగంలో సృజనాత్మకతకు ఎనలేని ప్రాధాన్యం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవి పరిశ్రమలుగానే కాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులు, ప్రజల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అద్భుతంగా పురోగమిస్తోందని.. పంటలు, పాలు, మాంసం, చేపలు, వంట నూనెల ఉత్పత్తిలో విప్లవాత్మక అభివృద్ధి సాధించిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల వల్లే ఇది సాధ్యమైందని కేటీఆర్ వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగమైన ఆహారశుద్ధి పరిశ్రమలను బలోపేతం చేసేందుకు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టామన్న మంత్రి.. 10 వేలకు పైగా ఎకరాలు కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని.. ఇప్పటికే కోకకోలా, పెప్సికో, ఐటీసీ వంటి దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయని కేటీఆర్ తెలిపారు.
అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో అక్కడి ‘క్రిటికల్ రివర్’ సంస్థ వ్యవస్థాపకులు అంజి మారం ఇతర ప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు. నిజామాబాద్‌లోని ఐటీ హబ్‌లో వారి సంస్థను ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియా, హైదరాబాద్, విజయవాడలలో కలుపుకొని.. దాదాపు వెయ్యి మంది ఉద్యోగులతో తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. నిజామాబాద్ ఐటీ హబ్‌కు వివిధ సంస్థలు రావడానికి కృషి చేస్తున్న గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్(Global NRI Coordinator) మహేశ్ బిగాలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.