భాగ్యనగరంలోని పేదలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్‌లోపు నియోజకవర్గానికి నాలుగు వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల కుటుంబాలకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. పక్కా ఇళ్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా కేటీఆర్ ఖండించారు. సీఎం కేసీఆర్ వయసుకు గౌరవం ఇవ్వకుండా.. నోటికొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడే పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ప్రజల అవసరాల దృష్ట్యా ఇప్పటికే 70కి.మీల మెట్రో రైలు మార్గం పూర్తయిందని.. అతి తక్కువ ఖర్చుతో ఓఆర్‌ఆర్ చుట్టూ 159 కి.మీల మెట్రోకు ప్రణాళికలు రచించినట్లు కేటీఆర్ వివరించారు. త్వరగా భూసేకరణ పూర్తి చేసి మొత్తం 314 కి.మీ మెట్రో మార్గాన్ని నాలుగేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
రానున్న ఎన్నికల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని వ్యాఖ్యానించారు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో లబ్ధిదారులకు భూ క్రమబద్ధీకరణ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.