తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ( Minister KTR) తిప్పికొట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగకు ఓటు వేద్దామా? అని ప్రజలను మంత్రి కేటీఆర్ అడిగారు. సూర్యాపేటలో ఐటీ హబ్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ దేశ ప్రజలు కాంగ్రెస్(Congress) పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. మళ్లీ ఒకసారి చాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో కాలిపోయే మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు. ఎరువులు, విత్తనాలను పోలీసు స్టేషన్‌లో ఉంచి పంచిపెట్టిన దుస్థితి. ఇలాంటి వారికి ఓట్లు వేద్దామా..? ఓటుకు నోటు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగకు ఓటు వేద్దామా? అలాంటి వారికి ఓటేస్తే రాష్ట్రాన్ని దోచుకుంటారు. ఒక్కోసీటుకు ఒక్కో రేటు పెట్టి అమ్ముకుంటున్నాడు. రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడో లేదో ఆలోచించండి. కేసీఆర్ నాయకత్వంలో 75 ఏండ్లలో ఎవరూ చేయని పనులు చేసుకుంటున్నాం.
ఏ ప్రధాని, ఏ సీఎం ఆలోచన చేయని విధంగా రైతుబంధు(raithu bandu) కింద డబ్బులు జమ చేస్తున్నాం. రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు జమ చేశాం. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. దీంతో కేసీఆర్ మా పెద్ద కొడుకు అని వృద్ధులు చెబుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. దళితబంధులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు మాట్లాడటం సరికాదని కేటీఆర్ అన్నారు. రోడ్ల మీద చెప్పులు కుట్టే 18 కుటుంబాలకు దళిత బంధు అమలు చేసి ఇచ్చారు జగదీశ్ రెడ్డి. మేం అడగకుండానే మాకు దళితబందు ఇచ్చారని లబ్దిదారులు అంటున్నారని మంత్రి తెలిపారు.
2014కు ముందు కరెంట్ కష్టాలు ఉండే.. నాడు ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలు అయ్యాక స్నానాలకు బావుల వద్దకు పోతే కరెంట్ ఉండేది కాదని కేటీఆర్ గుర్తు చేశారు. బావుల కాడ స్నానం చేయలేని దుస్థితి. రోజు ఆరు గంటల కరెంట్ అన్నారు.. కానీ ఏనాడూ మూడు గంటల కరెంట్ ఇవ్వలేదు. 24 గంటల కరెంట్ వస్తలేదని కోమటిరెడ్డి అంటున్నాడు. 24 కరెంట్ వస్తే రాజీనామా చేస్తానని అంటున్నాడు. అనుమానం ఎక్కువుంది కదా.. మీరు, మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వస్తారో అక్కడికి రండి. బస్సులు మేం పెడుతాం. ఖర్చు మాదే. సూర్యాపేట జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఏ గ్రామానికి పోతారో మాకు అభ్యంతరం లేదు.
ఏ టైంకు పోతారో పోండి. అందరూ మంచిగా లైన్లో నిలబడి కరెంట్ తీగలను గట్టిగా పట్టుకోండి. కరెంటో వస్తుందో లేదో తెలిసిపోతది. దేశానికి దరిద్ర్యం కూడా పోతది. ఈ సిపాయిలు ఇది వరకు ఏదో పీకి పందిరి వేసిండ్రు అంటా.. మేం వచ్చి చెడగొట్టమటా. కరెంట్, మంచినీళ్లు ఇవ్వలేని ముఖాలు. సాగునీరు, కరెంట్, మంచినీరు ఇచ్చి కేసీఆర్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తిన్నది అరగక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.