ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పక్క రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్‌కు అర్థమైంది. కానీ రాష్ట్రంలోని విపక్షాలకు అర్థం కావడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో చేపట్టిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
ప్రతిపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసునని, తమకు మాత్రం కట్టడం తెలుసునన్నారు. మల్లు భట్టి ఇటీవల పాదయాత్ర చేశారని, ఆయనకు అభివృద్ధి కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఆయన ప్రతిపక్షంలో వందేళ్లు ఉండాలని కోరుకుంటున్నానని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పది కాలాల పాటు నిలిచే పథకాలకు రూపకల్పన చేశారన్నారు. మల్లు భట్టికి తన పాదయాత్రలో ఇదేమీ కనిపించలేదా? అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీలో పదిమంది ముఖ్యమంత్రులని ప్రచారం సాగుతోందని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్‌కు కనిపించడం లేదన్నారు. తాము చేసిన అభివృద్ధి సీతక్క, రఘునందనరావు, భట్టికి తెలియదా? అన్నారు. దుబ్బాకలోని ముస్తాబాద్‌లోకి యూపీ, బీహార్, బెంగాల్ నుండి కూలీలు వస్తారని మీకు తెలుసు కదా అన్నారు. మనం రివర్స్ మైగ్రేషన్ చూస్తామని అనుకున్నామా? ఇదంతా సంపద సృష్టివల్ల జరిగిందన్నారు. అభివృద్ధి ఏమాత్రం జరగలేదంటే ఎలా? అన్నారు. గతంలో బతుకమ్మను విడిచేందుకు నీళ్లు కూడా లేకపోయేవని, నీళ్ల కోసం అనుభవించిన బాధ మహిళలకు, బతుకమ్మకూ తెలుసన్నారు. తెలంగాణలో ఏ గ్రామాన్ని ఫోటో తీసినా వైకుంఠధామం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పచ్చని చెట్లు కనిపిస్తాయన్నారు.
కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్, తెలంగాణపై కలలు కంటోందని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణలో ఏం జరగలేదనే వారు అభివద్ధిని చూసి మాట్లాడాలన్నారు. ఇక బీజేపీ వాళ్లు ఇక్కడ ఏమీ అభివృద్ధి లేదంటారని, ఢిల్లీవారు బాగుందంటారని, ఏది నిజమో చెప్పాలని నిలదీశారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి చేశామన్నారు. తాము 36 ఫ్లైఓవర్లు కడితే, కేంద్రం రెండు కూడా పూర్తి చేయలేకపోయిందన్నారు. సీతక్కను గెలిపించినప్పటికీ ములుగును కేసీఆర్ జిల్లాగా ప్రకటించారన్నారు. ఇంటింటికీ నీళ్లివ్వకుంటే ఓట్లు అడగనన్న దమ్మున్న నేత దేశంలో ఎవరైనా ఉన్నారా? అన్నారు.
తమ దృష్టిలో బడ్జెట్ అంటే ప్రజల జీవనాడి అన్నారు. ఒక డబుల్ బెడ్రూం ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానమన్నారు. కాంగ్రెస్ కట్టినవి అన్నీ డబ్బా ఇళ్లే అన్నారు. కాంగ్రెస్ పాలనలో నీళ్ల కోసం వెళ్తే కన్నీళ్లు పెట్టించారన్నారు. గుజరాత్ మోడల్ అనేది వట్టి డొల్ల అన్నారు. తెలంగాణలో ఏ పట్టణంలో.. ఏ పల్లెలో చూసినా సంతోషం ఉందని, కాంగ్రెస్‌లో మాత్రం సంక్షోభం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు, శాంతిభద్రతలను జగన్ మెచ్చుకున్నారని, ఇక్కడ జరిగిన మంచి ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతలకు కనిపించిందని, కానీ ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్‌లకు కనిపించడం లేదన్నారు. జగన్, చంద్రబాబులకు ఈ సందర్భంగా కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.
సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో పని చేయడం కావాలని, అది తాము చేస్తున్నామన్నారు. తాను అమెరికాలో చదువుకున్నానని, అక్కడ కూడా సమస్యలు ఉంటాయని, రోడ్ల మీద తిరుగుతారని, అక్కడక్కడా అడుక్కు తింటారని, అలాగే మన వద్ద సమస్యలు ఒకదాని వెనుక ఒకటి వస్తాయని, ఒక్కో సమస్యను తాము చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నామన్నారు.