పాలమూరు – రంగారెడ్డి(Palamuru – Rangareddy) ఎత్తిపోతలపై ఏపీ ఇంటర్‌లొకేటరీ వేసిన అప్లికేషన్‌పై కృష్ణా ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్ ను బుధవారం కొట్టివేసింది. తెలంగాణ 90 టీఎంసీల నీరు వాడకుండా ఆపాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై విచారణ అధికారం తమకు లేదని కృష్ణా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. 2022 ఆగస్టులో తెలంగాణ ఇచ్చిన జీవో 246పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు వేసింది. దీంతో ట్రైబ్యునల్‌లో జులై 14 వరకు వాదనలు జరిగాయి. ఇవాళ ఈ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది ఉత్తర్వులు వెల్లడించింది. ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై విచారణ అధికారం తమకు లేదని.. తగిన వేదికలను ఆశ్రయించాలని తుది ఉత్తర్వుల్లో ట్రైబ్యునల్ పేర్కొంది.
పాలమూరు ప్రాజెక్ట్‌పై కృష్ణా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు(Krishna Tribunal Judgement)పై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పందించారు. ఇది పాలమూరు విజయంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై కృష్ణా ట్రెబ్యునల్ తీర్పును మంత్రి స్వాగతించారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(Palamuru-Ranga Reddy lift Irrigation Project)కు 90టీఎంసీల వరకు కృష్ణా జలాలు తీసుకోవచ్చని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ, మోటా, కేంద్ర భూగర్భ జలశాఖ, విద్యుత్ ప్రాధికార సంస్థ, కేంద్ర మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ లాంటి సంస్థల అన్ని రకాల అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. ట్రెబ్యునల్ తీర్పు ద్వారా సబ్ జ్యూడిస్ అడ్డంకి తొలగిపోయిందని అన్నారు. ఈ ప్రాజెక్టులో ఉన్న మరిన్ని అడ్డంకులను కేంద్ర ప్రభుత్వ గుర్తించి వీలైనంత త్వరగా తొలగించాలని కోరారు. కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను కూడా వెంటనే తేల్చాలన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో సీఎం కేసీఆర్ పట్టుదలే ఈ విజయానికి కారణమని తెలిపారు.