టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ సెటైర్లు వేశారు. టెక్నాలజీలో నాకు చాలా తెలుసు.. అని చెప్పుకునే చంద్రబాబు దాని ద్వారానే దొంగ ఓట్లు ఉంటే తెలుసుకోవచ్చు కదా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీలో ప్రతీ ఒక్కటీ కనిపెట్టే చంద్రబాబు ఆదార్ సీడింగ్ ద్వారా ఎవరివి దొంగ ఓట్లో తెలసుకోవచ్చున్నారు. నగదు బదిలీలో వందలు, వేల కోట్ల అవినీతీ జరిగిందని చంద్రబాబు హాస్యాస్పద ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీఎల్వోలతో పాటు ఇంటింటి సర్వేకి అన్నీ పార్టీలు వెళ్తున్నాయి.. దొంగ ఓట్లు ఉంటే తెలిసిపోతుందని అన్నారు.
‘తెలంగాణా బీజేపీ నేత బండి సంజయ్ ఇక్కడ ఎవరికి మద్దతుగా మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలి. వైసీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చేయలని అర్దం లేని ఆరోపణలు. తరిమి తరిమి కొడతాం.. బట్టలూడ దీసి కొడతాం అంటూ మహిళలు ఉన్నారని కూడా చూడకుండా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు.. ఎర్రడైరీ ఉంది.. పచ్చ డైరీ ఉందంటూ అధికారులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.. గతంలో మీరు వెలగబెట్టినదంతా ప్రజలు చూశారు.. టీడీపీ ఏం చేస్తుందో రాష్ట్రం మొత్తం చూస్తుంది.. ఏపీలో ఎక్కడా దొంగఓట్లు ఉన్నా తీసేస్తాం.. గతంలో టీడీపీ హయాంలో పెట్టిన వేల దొంగ ఓట్లు తీయించాం.. టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు.. సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా టీడీపీ నేతల మాటలు ఉన్నాయి.. పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారు.. గతంలో ఎర్రగొండపాలెంలో టీడీపీ నేతలే హైప్ కోసం కావాలని చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేసుకున్నారు.. ఎర్రగొండపాలెంలో రాళ్లదాడిలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. ‘ అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.