హిందువులకు అతి ముఖ్యమైన పర్వదినం “వినాయక చవితి”. శివపార్వతుల కుమారుడైన గణనాథుడి జన్మదినాన్ని పురస్కరించుకుని “వినాయక చవితి” జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో నాలుగో రోజు..అంటే చవితి రోజు ప్రారంభమై..నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. వినాయకచవితి రోజు ప్రతిఇంట్లో బొజ్జగణపయ్య సందడి ఉంటే.. మండపాల్లో మాత్రం దాదాపు 11 రోజుల పాటూ లంబోదరుడు పూజలందుకుని.. ఆ తర్వాత ఊరేగింపుగా గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. భారత దేశం లో ని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగని “గణేష్ చతుర్ధి” లేదా “వినాయక చతుర్ధి” అని కూడా పిలుస్తారు. ఏ కార్యం ప్రారంభంచాలన్నా, ప్రారంభించిన పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని వేడుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబరు 18న వచ్చింది. వీధికో లంబోదరుడు దర్శనమిచ్చినా ఖైరతాబాద్ విగ్రహానికున్న ప్రత్యేకతే వేరు.
విఘ్నాధిపతిగా తొలిపూజ అందుకునే గణపయ్యను వాడవాడలా ఘనంగా పూజించే వేడుక దగ్గరకొచ్చేస్తోంది. గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. శ్రీ దశమహా విద్యాగణపతి భక్తులను అనుగ్రహించనున్నాడు పార్వతీ తనయుడు. విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఉండనుంది. నిల్చున్న తీరులో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ విగ్రహం ఉండగా.. తలపై ఏడు సర్పాలు ఉండనున్నాయి. వెనక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది. పది చేతులు ఉంటాయి. కుడి వైపు చేతుల్లో కింద నుంచి పైకి ఆశీర్వాదం, దండ, ధాన్యం, తల్వార్, బాణం ఉంచుతారు. ఎడమవైపు కింద నుంచి పైకి చేతిలో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంటాయి. కాళ్ల వద్ద అటూ ఇటూ పది అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. ప్రధాన మండపం రెండు వైపులా శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, శ్రీ వీరభద్ర స్వామి వార్ల విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటాయి. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. చవితి పండుగకు మూడు రోజుల ముందే భక్తులు విగ్రహాన్ని చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ హితం కోసం మట్టి గణపతినే ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు నిర్వాహకులు.