ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli CM Camp Office)లో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan)అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్(AP Cabinet) ఆమోదించింది. ఈ సందర్బంగా పరిపాలనా రాజధాని విశాఖ(Administrative capital Visakhapatnam) గురించి ప్రస్తావిస్తూ సమావేశంలో సీఎం కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు.
విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు. అలాగే ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామన్నారు. ఈ క్యాబినెట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్(GPS) అమలు బిల్లుకు ఆమోదం తెలిపారు. ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు(employees), వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలి. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం(Jagananna Civil Services Promotion) పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి, ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం తెలిపారు. ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ చేశారు. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్(Joint Certification) ఇచ్చేనందుకు ఓకే చెప్పారు. ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుందన్నారు.
ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీలతో టై అప్ ఉండేలా చట్ట సవరణ. దీనివల్ల జాయింట్ సర్టిఫికేషన్(Joint Certification)కు వీలు కలుగుతుంది. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. దీని పిల్లలకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా.. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో(Kurupam Engineering Colleges) 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలుపడంతో పాటు.. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం.. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం.. దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం తెలిపారు.