తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహకాలు చేస్తోంది. ఈ ఏడాది గోల్కొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నట్లు సీఎస్ శాంతి కుమారిపేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో రాష్ట్ర యంత్రాంగం ఇప్పటికే చకచకా పనులు చేసుకుంటూ వెళ్తోంది. మరోవైపు ఆగస్టు 15వ తేదీన విద్యార్థులకు ఉచితంగా గాంధీ బొమ్మలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
తెలంగాణ వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 12వ తేదీన కోటి మొక్కలు నాటేందుకు కేసీఆర్ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఈ వజ్రోత్సవాల ప్రారంభం సందర్భంగా 2022 ఆగస్టు 21న రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పల్లెల్లో, పట్టణాల్లో విస్తృతంగా మొక్కలు నాటారు. అదే తరహాలో ముగింపు ఉత్సవాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంట్లో భాగంగా కేసీఆర్ మంచిరేవుల ఫారెస్టు పార్కులో మొక్కలు నాటనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తీసుకొచ్చిన తెలంగాణకు హరితహారం పథకం అభివృద్ధి ఫలాలను ఇస్తుంది. హరితహారం పథకంతో రాష్ట్రంలో గ్రీనరీ పెరిగింది. అత్యున్నత ఆఫీసర్ సామాన్యుడు వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అవే ఇప్పుడు పెరిగి పెద్దవై రాష్ట్రం పచ్చదనం శోభతో విరాజిల్లుతోంది.సకాలంలో వర్షాలుపడి.. రైతులు సుభిక్షంగా వ్యవసాయం చేసుకోవాలన్న ఆలోచనలతో రాష్ట్రం ఎల్లవేళలా పచ్చగా ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు.