‘సనాతన ధర్మం’ పై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udaynidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సనాతన వివాదంపై సీనియర్ నటుడు, మక్కల్ నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Hasan) స్పందించారు. సనాతన ధర్మం (Sanathan Dharma)పై గతంలోనూ చాలా మంది మాట్లాడారని, ఆ అంశంపై మాట్లాడినందుకు చిన్నపిల్లవాడైన ఉదయనిధిని అంతా టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు.
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ.. ‘ఉదయనిధి కంటే ముందు కూడా పలువురు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అయితే, ఈ విషయంలో చిన్న పిల్లవాడైన ఉదయనిధిని అంతా టార్గెట్ చేశారు. నిజం చెప్పాలంటే సనాతన అనే పదం పెరియర్ (Periyar ) ద్వారానే అందరికీ తెలిసింది. ఆయన ఓ ఆలయంలో పనిచేసేవారు. నుదుటిపై తిలకం దిద్దుకుని వారణాసిలోని ఓ గుడిలో పూజలు చేసేవారు. అలాంటి వ్యక్తి వాటన్నింటినీ విడిచిపెట్టి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారంటే ఆయనకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించండి. ఆయన జీవితమంతా ప్రజల సేవతోనే గడిచింది. డీఎంకే లేదా ఇతర ఏ పార్టీ కూడా పెరియర్‌ని తమ వారేనని చెప్పడానికి వీల్లేదు. ఎందుకుంటే ఆయన ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదు. తమిళనాడు మొత్తం పెరియర్ తమ వారేనని చెప్పుకుంటుంది’ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
కాగా, ఇటీవలే ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేదే లేదన్నారు.