శక్తి స్వరూపుణి వెలసిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో నీలాచల్ పర్వతశ్రేణి మీద ఈ కామాఖ్యా దేవి క్షేత్రం విరాజిలుతోంది. ఎలాంటి విగ్రహారాధనా జరగని కామాఖ్యా అమ్మవారి ఆలయ విశేషాలు..
కామాఖ్యా దేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధనా జరగదు. ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు. సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది.
ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. దీనిని సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలు పెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకూ అమ్మవారి ఋతు స్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు. నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు.
అమ్మవారి ఆలయ ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెబుతారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపురంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని పిలుస్తారు. ఇక దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతి కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మరోసారి పార్వతి కుండంలో తలస్నానం చేయడం ఇక్కడి ఆనవాయితీ.
ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. ఈ స్వాగత ద్వారం ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది.
ప్రతీ ఆషాఢమాసంలో అయిదు రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఈ అంబుబాచి మేళానే కామాఖ్యా కుంభమేళాగా పిలుస్తారు. ఈ మేళా కనీవినని రీతిలో జరుగుతుంది. వేలాదిమంది పండాలు, సిద్దులు వంటి వాళ్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తిశ్రద్ధలను చాటుకుంటారు.
సాధారణ రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. కామాఖ్యాక్షేత్ర శక్తి పీఠం మంత్ర, తాంత్రిక, ఐంద్ర జాలాలకు కేంద్రస్థానంగా చెబుతారు. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు. నీలాచలానికి తూర్పుభాగంలో బ్రహ్మపుత్రా నది మధ్యలో లింగ స్వరూపంలో స్వామి దర్శనమిస్తాడు.