తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లాలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ నిజస్వరూపాన్ని చూశారని ఆరోపించారు. ఒక శాతం ఉన్న వెలమలకు 12 శాతం ఎమ్మెల్యే సీట్లు, 5 శాతం ఉన్న రెడ్లకు 48 సీట్లు, 50 శాతం ఉన్న మహిళలకు 7 సీట్లు, 60 శాతం ఉన్న బీసీలకు 23 సీట్లు ఇచ్చారని పాల్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి రానివాళ్లు 300 మంది బీఆర్ఎస్ నాయకులు ప్రజాశాంతి పై పార్టీ వైపు చూస్తున్నారని కేఏ పాల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అవినీతి భూకబ్జాలు చేసిన వాళ్లకు లక్షల కోట్లు దోచుకున్న వారికి టిక్కెట్ ఇచ్చాడే తప్ప.. ఒక్క నీతిపరుడికి ఇచ్చాడా అని ప్రశ్నించారు. గద్దర్ బ్రతికి ఉన్నప్పుడు ప్రగతి భవన్ మెట్లు ఎక్కనివ్వని సీఎం కేసీఆర్.. చనిపోయినప్పుడు మాత్రం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయించాడని పాల్ పేర్కొన్నారు.
అంతేకాకుండా.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని పాల్ ఆరోపించారు. నూటికి 60 నుంచి 70 శాతం మంది ప్రజాశాంతి పార్టీని ప్రజలు కోరుకుంటున్నారని సర్వేలే చెబుతున్నాయని పేర్కొన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం.. వడ్డీలు కట్టే పరిస్థితిలో లేదు కేసీఆర్ పాలనలో అని విమర్శించారు. మరోవైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని పాల్ తెలిపారు. ఈవీఎంల లోపం వల్లనే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఓడిపోయిందన్నారు. మరోవైపు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే చెప్పుకోలేని స్థితిలో ఆ రాష్ట్ర ప్రజలు ఉన్నారని.. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో 60 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.