ఆభరణాలు అంటే బంగారం మాత్రమే అనే అభిప్రాయానికి కాలం చెల్లిందంటే అతిశయోక్తి కాదు. వన్ గ్రామ్ గోల్డ్, రెడీ టూ వేర్ వంటి ఆభరణాలు బంగారం కంటే ఎక్కువ మోడల్స్ లో లభిస్తున్నాయి. ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండటంతో చాలా మంది వీటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా విభిన్న రీతిలో అద్భుతమైన డిజైన్లలో ఆభరణాలు రూపొందించే వారి కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి. దీంతో జ్యూయెలరీ డిజైనర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. సృజనాత్మకంగా ఆలోచించేవారు, కొత్త కొత్త డిజైన్ల తయారీపై ఆసక్తి ఉన్నవారు, ప్రతి చిన్న వస్తువు రూపునూ లోతుగా గమనించే దృష్టి ఉన్నవారికి జ్యువెలరీ డిజైనింగ్ చక్కని ఎంపిక.
కోర్సులు
బీడీఎస్ ఇన్ జ్యువెలరీ డిజైన్, డిప్లొమా, బీఏ ఇన్ జ్యువెలరీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, బీఎస్సీ ఇన్ జ్యువెలరీ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్, ఎమ్మెస్సీ ఇన్ జ్యువెలరీ డిజైన్, ఎండీఎస్ ఇన్ జ్యువలరీ డిజైన్ వంటి పలు పూర్తిస్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ పలు స్వల్పకాల వ్యవధి గల కోర్సులు లభిస్తున్నాయి. వీటికి కోర్సు కాల వ్యవధి, కళాశాలను బట్టి సగటున రూ.20 వేల నుంచి రూ.4 లక్షల వరకూ ఫీజు ఉంటుంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెమ్ అండ్ జ్యువెలరీ, జేడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఎలెన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ – జైపూర్, ఆర్క్ కాలేజ్ ఆఫ్ డిజైన్ అండ్ బిజినెస్ – జైపూర్, వోగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ – బెంగళూరు, పరుల్ యూనివర్సిటీ – గుజరాత్, బియాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ – జైపూర్, జైన్ యూనివర్సిటీ – బెంగళూరు, ఎన్‌ఎస్‌ఏఎం అకాడమీ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్ – ముంబయి తదితర కళాశాలలు మనదేశంలో జ్యువెలరీ డిజైనింగ్ కోర్సులకు చెప్పుకోదగ్గవి.
ఈ స్కిల్స్ ఉంటే మీరు అర్హులే..
ఈ రంగంలో రాణించేందుకు కొత్తగా ఆలోచించడం, అందంగా – సృజనాత్మకంగా మోడల్స్‌ను గీయడం, వాటిని ఆకట్టుకునేలా రూపొందించగలగడం అనేదే ప్రధానమైన అర్హత. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన చదువు పూర్తి చేసి ఉండాలి. ఆభరణాల డిజైనింగ్ పై మక్కువ ఉండటంతో పాటు క్రియేటివ్ థింకింగ్, సాంకేతిక నైపుణ్యాలు, లోహాలు, లోహ మిశ్రమాలకు సంబంధించిన రసాయన శాస్త్ర అవగాహన ఉండాలి. వీటితో పాటు కెమికల్ ఈక్వేషన్స్ అర్థం చేసుకోవగలగాలి. ఈ అంశాలను కోర్సుల రూపంలో నేర్చుకోవచ్చు. దీని ద్వారా డిజైనింగ్ స్కిల్స్‌తో పాటు క్యాస్టింగ్, ఎన్‌గ్రేవింగ్, స్టోన్ కట్టింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, పాలిషింగ్, ఏనోడైజింగ్, మెటల్ కలరింగ్, స్టోన్ సెట్టింగ్, ఎనామ్లింగ్, సిల్వర్ స్మిత్తింగ్ వంటి అనేక నైపుణ్యాలను కూడా కోర్సులో భాగంగా నేర్పిస్తారు.
అవకాశాలు ఎలా?
ఈ కోర్సులు పూర్తి చేసిన వారు అభ్యర్థులు క్యాడ్ డిజైనర్, మాన్యువల్ డిజైనర్, రీటచర్, సెట్టర్, జెమాలజిస్ట్, బెంచ్ జ్యువెలర్, డైమండ్ గ్రేడర్, జెమ్ పాలిషర్ వంటి కొలువుల్లో చేరవచ్చు. వీరికి యాక్సెసరీ డిజైనింగ్ హౌసెస్, జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరింగ్, పేరుమోసిన జ్యువెలరీ సంస్థల్లోనే కాకుండా సినిమా, టీవీ పరిశ్రమలోనూ అవకాశాలు ఉంటాయి.
ఈ రంగంలో ప్రారంభ వేతనం నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఉంటుంది. తర్వాత సామర్థ్యానికి అనుగుణంగా నెలకు రూ.లక్ష వరకు వేతనం అందుకుంటారు.