ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయింది. అయితే.. బస్సు వేగంగా వెళ్తుండటంతో అదుపు తప్పి, పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేసారు. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడం బాధాకరమని అన్నారు. అధికారుల నుండి ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న జగన్ అన్నిశాఖల అధికారులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైదన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారుల్ని ఆదేశించారు. వైద్య సేవల్లో ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. అలాగే.. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు.
మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. అలాగే క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న వరుస రోడ్డుప్రమాదాలు ఆదోళన కలిగిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. తాజాగా దర్శి వద్ద జరిగిన ప్రమాదం అయితే మాటలకందని విషాదమని.. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని సూచించారు.
ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. ‘ప్రకాశం జిల్లా దర్శి వద్ద సాగర్ కాలువలో పెళ్లి బృందం బస్సు పడిపోయిన దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో 12 మంది గాయపడ్డారని తెలిసి చాలా బాధ కలిగింది. ఎంతో వేడుకగా పెళ్లి ముగించుకుని కాకినాడలో రిసెప్షన్ కోసం వెళుతున్న ముస్లిం కుటుంబాల సభ్యులు ఈ ప్రమాదంలో అశువులు బాయడం అత్యంత విచారకరం. గత అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం మానవ తప్పిదమా? లేక ఆర్టిసి బస్సు సాంకేతిక స్థితి సక్రమంగా లేదా అనే విషయమై అధికారులు దర్యాప్తు చేయాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసదుపాయం కల్పించడంతో పాటు మృతుల కుటుంబాలను ఆర్థికంగానూ ప్రభుత్వం సాయపడాలని కోరుతున్నాను’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేసారు.