తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సరదాగా ముచ్చటించారు. శాసనసభలో మంత్రి కేటీఆర్.. ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఈటలను ఆలింగనం చేసుకున్నారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్, ఈటల సుమారు పది నిమిషాల పాటు ముచ్చటించారు. గతంలో కేసీఆర్‌తో విభేదించిన ఈటల.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో తీవ్ర పోటీని ఎదుర్కొని విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటల కొనసాగుతున్నారు.
ఇక మరోవైపు అసెంబ్లీ వెలుపల కేటీఆర్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య సరదా చర్చ జరిగింది. టీ షర్ట్‌లో ఉన్న జగ్గారెడ్డిని చూసి పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లన్న..? అని కేటీఆర్ అనగా, టీషర్ట్ వేసుకుంటే పిల్లలవుతారా? అని జగ్గారెడ్డి అడిగారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ కలిసి ఉండగా, మీ ఇద్దరికి ఎక్కడ దోస్తాన్ కుదిరింది అని కేటీఆర్ అడిగారు. దీంతో మాది ఒకే కంచం, ఒకే మంచమని మామిల్ల రాజేందర్ జవాబిచ్చారు. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తావా..? అని కేటీఆర్ ప్రశ్నించగా, సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తా.. మన దగ్గరకు పట్టుకొస్తా అని రాజేందర్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈటల, జగ్గారెడ్డితో కేటీఆర్ సంభాషణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.