రోజూ ఓ నలభై నిమిషాలు నడిస్తే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు వైద్యులు. బరువు తగ్గడం, డయాబెటిస్ లాంటివి కంట్రోల్ లో ఉండటం, డిప్రెషన్ తగ్గడం.. ఇలా వాకింగ్ వల్ల లేని ఉపయోగం లేదు. అయితే ఇందుకోసం గంట సేపు బ్రిస్క్వాక్ చేయమంటుంటారు. కానీ ఇటీవల జరిగిన అధ్యయనం వాకింగ్ బద్ధకం ఉన్నవాళ్లకు శుభవార్త తీసుకొచ్చింది.
నడక వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుందని ఇటీవలి పరిశోధన చెబుతున్నది. అంతేకాదు.. ఇందుకోసం రోజుకు కేవలం 11 నిమిషాలు నడిస్తే చాలంటోంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. చాలామంది ఉదయం వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్ ల చుట్టూ తిరుగుతుంటారు. బరువులు ఎత్తుతుంటారు. అలా కాకుండా కేవలం 11 నిమిషాల నడక లేదా దానికి సమానమైన శారీరక శ్రమ చేస్తే సరిపోతుందని చెప్తున్నది ఈ అధ్యయనం. వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల కారణంగా కొన్ని నిమిషాల నడక మన జీవితంలో భాగం చేసుకోక తప్పదని అంటున్నారు వైద్యులు. అంతేకాదు.. ఇతరత్రా శారీరక శ్రమను చేర్చడం ద్వారా భవిష్యత్తులో వ్యాధుల నుంచి తొందరగా బయటపడొచ్చు.
బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ జరిపిన ఈ పరిశోధన ప్రకారం యోగ, ఏదైనా వ్యాయామం లేదా 11 నిమిషాల చురుకైననడక.. గుండెపోటు, క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 10 మందిలో ఒకరు కనీసం వ్యాయామం చేయకుండా అంటే వారానికి కనీసం 75 నిమిషాల శారీరక శ్రమ చేయకపోవడం వల్లే లేనిపోని రోగాల బారిన పడుతున్నారని తేలింది. అంతేకాదు.. 23 శాతం ముందస్తు మరణాలు, 17శాతం గుండె జబ్బులు, 7శాతం మంది క్యాన్సర్ బారిన పడతున్నట్లు వెల్లడైంది.దాదాపు 30 మిలియన్ల మందిపై అధ్యయనం చేసిన తర్వాతే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తగినంతశారీరక శ్రమ లేకపోతే గుండెజబ్బులు, క్యాన్సర్, ముందస్తు మరణాలు సంభవిస్తాయని ఈ పరిశోధనలో తేలింది.
ఏ వయసు వారైనా రోజులో కాస్త సమయం నడకకు కేటాయించాల్సిందే! ఇంట్లో పనులు చేస్తూ, ఆఫీసుల్లో హడావిడి నడకను ఇందులో లెక్కకట్టడం కాదు. సరైన ఆక్సిజన్ ను తీసుకుంటూ మరీ ఈ వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆ నడక ద్వారా ప్రయోజనాలను పొందుతాం. ప్రతిరోజూ చిన్నపాటి నడకలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. నడక.. కీళ్లను బలోపేతం చేయడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. మానసిక స్థితి బాగుంటుంది. నిదానంగా నడవడం వల్ల 15 నిమిషాల్లో 9 కేలరీలు ఖర్చు అవుతే, 30 నిమిషాల్లో 25 కేలరీలు ఖర్చు అవుతాయి. నడక వేగం పెంచితే 15 నిమిషాల్లోనే దాదాపు 25 కేలరీలు ఖర్చు అవుతాయి.
రోగనిరోధక వ్యవస్థ, కండరాలు, ఎముకలు మొదలైన వాటిని బలోపేతం చేయడంలో నడక చాలా మంచిది. ప్రతిరోజూ కనీసం 11 నుంచి 15 నిమిషాల నడక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. మరింకేం… అందరూ వెంటనే వాకింగ్ షూలను సిద్ధం చేసుకోండి. రోజులో ఉన్న 24 గంటల్లో కనీసం 15 నిమిషాలను నడక కోసం కేటాయించుకోండి. ఆరోగ్యకరమైన జీవితానికి శ్రీకారం చుట్టండి.