ఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH) మాజీ ముఖ్యమంత్రి(EX CM), టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU)కు ఆదాయపన్ను శాఖ(IT DEPARTMENT) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొన్ని మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి రూ.118 కోట్లకుపైగా ముడుపులు స్వీకరించినట్టు ఐటీ శాఖ ఆరోపించింది. దీనిని అక్రమ సంపాదనగా పరిగణించి చట్టప్రకారం చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలని నోటీసులో పేర్కొంది. ఈ విషయంలో చంద్రబాబు లేవనెత్తిన అభ్యంతరాలను ఐటీశాఖ తోసిపుచ్చింది.
బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా సేకరించిన డబ్బు చంద్రబాబుకు చేరినట్టు ప్రాథమికంగా రుజువుచేసే ఆధారాలను ఇప్పటికే సేకరించామని, పలువురి వాంగ్మూలాలను కూడా రికార్డు చేశామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 2017 నుంచి టెండర్ల ప్రక్రియలో పాల్గొంటున్నది. ఈ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్దసాని ఇంటిపై దాడులు చేసిన ఐటీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆ తరువాత అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు తాను పనిచేస్తున్న సంస్థ కోసం నకిలీ సబ్ కాంట్రాక్ట్ కంపెనీల ద్వారా నిధులను కొల్లగొట్టేందుకు బోగస్ కాంట్రాక్టులను, వర్క్ ఆర్డర్లను సృష్టించినట్టు అంగీకరించాడు. పార్దసాని నుంచి స్వాధీనం చేసకున్న కొన్ని మెస్సేజ్‌లు, వాట్సాప్ చాట్‌లు, ఎక్సెల్ షీట్‌లలో పలు భారీ మౌలిక సదుపాయాల కంపెనీలు అక్రమాలకు పాల్పడిన విషయం వెల్లడైందని ఐటీశాఖ తన నోటీసులో పేర్కొంది.
ఈ సోదాలలోనే సదరు నగదు చంద్రబాబుకు అందిన విషయం కూడా బట్టబయలైందని పేర్కొంది. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పీ శ్రీనివాస్.. పార్దసానిని 2016 ఆగస్టులో కలుసుకొని తమ పార్టీ కోసం నిధులు సమకూర్చాలని కోరినట్టు తెలిపింది. ఆ మేరకు పార్దసాని పనిచేస్తున్న మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయించిన ప్రాజెక్టులలో ఎటువంటి పనులు జరుగకున్నా నిధులు విడుదల చేసి, వాటిని దారి మళ్లించారని అవి చంద్రబాబుకు చేరాయని వివరించింది. పార్దసాని పనిచేస్తున్న సంస్థతోపాటు మరో రెండు నిర్మాణ కంపెనీల ప్రాజెక్టుల నుంచి కూడా చంద్రబాబుకు ముడుపులు అందినట్టు ఆరోపించింది. మొత్తంగా 118,98,13,207 రూపాయలు చంద్రబాబుకు అందాయని, దీనిని అక్రమ సంపాదనగా ఎందుకు పరిగణించకూడదో తెలపాలని నోటీసులో కోరింది.