శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగు పెట్టింది. ఇక ల్యాండర్ చంద్రునిపై తన పనిని మొదలుపెట్టింది. చంద్రుడు పుట్టినప్పటి నుంచి ఈ దక్షిణ ధ్రువ ప్రాంతం అతి తక్కువ సమయం సూర్య కాంతికి గురవుతూ వస్తోంది. ఇక్కడి లోయలు లేదా క్రేటర్‌లు శాశ్వత నీడ ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ పర్మినెంట్లీ షాడోడ్ రీజియన్లలో ప్రగ్యాన్ రోవర్ ప్రవేశిస్తుందా అన్న దానిపై ఇస్రో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే వీటికి దగ్గర్లో మాత్రం పరిశోధనలు చేయనుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు అతి తక్కువ ఉండటం వల్ల చంద్రుని పుట్టుక నాటి పరిస్థితులు ఈ మట్టిలో చెక్కుచెదరకుండా లభ్యమయ్యే అవకాశం ఉంది.
తద్వారా భూమి, సౌర కుటుంబం పుట్టుక సమయంలోని విషయాలు తెలుసుకోవచ్చు. అతి ముఖ్యంగా జాబిల్లి దక్షిణ ధ్రువంలోని మట్టిలో నీటి అణువులు గడ్డకట్టిన పరిస్థితిల్లో దొరికే అవకాశం మెండుగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు చంద్రుని మధ్యరేఖా ప్రాంతంలో ఎక్కడా కనిపించవు. నీటితో పాటు మినరళ్లు ఇక్కడ ఉండే అవకాశం ఉందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు.”దక్షిణ ధ్రువంపై పరిశోధనలతో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ సూర్యరశ్మి చాలా తక్కువగా పడుతుంది. దీని వల్ల అక్కడ శాస్త్రీయ వివరాలు మరింత ఎక్కువగా లభ్యమవుతాయి. ఇక్కడి ఉపరితలానికి కింద పొరల్లో నీరు ఉండే అవకాశం ఉంది. వివిధ మూలకాలు ఉనికి లభ్యమవడంతో పాటు ఎలక్ట్రికల్ యాక్టివిటీలు జరిగే అవకాశాలు మధ్యరేఖా ప్రాంతంతో పోలిస్తే దక్షిణ ధ్రువంలో చాలా ఉన్నాయి.
అందుకే శాస్త్రవేత్తలు ఈ దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.” అని ఎస్. సోమ్‌నాథ్ ఇస్రో ఛైర్మన్ తెలిపారు. మానవాళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు కాలనీలు నిర్మించేందుకు దక్షిణ ధ్రువంపై ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.చంద్రున్ని అధ్యయనం చేసే పరిశోధకులు.. దక్షిణ ధ్రువంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. చంద్రయాన్ 1 లో ఇంపాక్టర్ ప్రోబ్ తొలిసారిగా చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది. ఈ నేపథ్యంలో దక్షిణ ధ్రువం సమీపంలోనే చంద్రయాన్-3 దిగి అన్వేషణ కొనసాగిస్తోంది.