ఏపీలో వైద్య రంగంలో మూడు ప్రైవేట్ వైద్య కళాశాలల అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. శాంతిరామ్(Shanthiram), జీఎస్‌ఎల్, మహారాజా(Maharaja) వైద్య కళాశాలలకు కలిపి పీజీ వైద్య విద్యలో(PG Medical Education) వాస్తవంగా ఉన్న పీజీ సీట్లు 200 మాత్రమే కాగా.. ఈ మూడు కళాశాలల్లో కలిపి నకిలీ ఎల్‌ఓపీలతో వచ్చిన సీట్ల సంఖ్య 235గా తేలింది. ఈ మేరకు ఆరోగ్య విశ్వవిద్యాలయం జాతీయ వైద్య కమిషన్‌కు లేఖ రాసింది. నకిలీ ఎల్‌ఓపీల ద్వారా సీట్ల పెంచుకునేందుకు ఈ మూడు కళాశాలలు పోటీపడ్డాయి. ఈ సీట్ల కుంభకోణంతో జాతీయ మీడియాలో ఏపీ కళాశాలల పేర్లు మార్మోగుతున్నాయి. రాష్ట్రానికి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చిన ఎల్‌ఓపీల నిశిత పరిశీలన అనంతరం నకిలీ ఎల్‌ఓపీల ద్వారా మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విజయనగరం) 84, జీఎస్‌ఎల్ (రాజమహేంద్రవరం) 79, శాంతిరామ్ (నంద్యాల) 72 చొప్పున సీట్లు సృష్టించారు.
కిందటి వారం వరకు వీటి సంఖ్య 152 వరకు మాత్రమే ఉంది. జాతీయ వైద్య కమిషన్, రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయం మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం ఎల్‌ఓపీ (Letter of Permission)ల నిశిత పరిశీలన ద్వారా ఈ మూడు వైద్య కళాశాలలకు కలిపి 27 నకిలీ ఎల్‌ఓపీల ద్వారా 235 సీట్ల సృష్టి జరిగింది. గతనెల 29వ తేదీ నుంచి నకిలీ ఎల్‌ఓపీల జారీ వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోనికి వస్తూనే ఉన్నాయి. తొలుత నంద్యాలలోని శాంతిరామ్ వైద్య కళాశాలకు 50, రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్(GSL వైద్య కళాశాలకు 63, విజయనగరంలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలకు 23 చొప్పున సీట్లు నకిలీ ఎల్‌ఓపీల ద్వారా వచ్చినట్లు అనుకున్నారు. కానీ.. గత వారం జీఎస్‌ఎల్ కళాశాలకు రేడియో డయాగ్నసిస్ కోర్సులో 10కు బదులు 24, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఒకటికి బదులు అదనంగా రెండు సీట్లు వచ్చినట్లు నకిలీ ఎల్‌ఓపీల ద్వారా తెలిపింది.
తాజా సమాచారంతో మొత్తంగా శాంతిరామ్ కళాశాలకు నకిలీ ఎల్‌ఓపీల ద్వారా పీజీలో 72 (8 స్పెషాల్టీలు), జీఎస్‌ఎల్ కళాశాలకు 79 (8 స్పెషాల్టీలు) చొప్పున సీట్లు వచ్చినట్లు స్పష్టమైంది. ఇదే సమయంలో ఎన్‌ఎంసీ విడుదల చేసిన బహిరంగ ప్రకటన ద్వారా మహారాజా కళాశాలకు నకిలీ ఎల్‌ఓపీల ద్వారా 11 స్పెషాల్టీలో 84 సీట్లు వచ్చినట్లు తేలడం గమనార్హం. అత్యధికంగా జనరల్ సర్జరీలో 16 సీట్లు నకిలీ ఎల్‌ఓపీల ద్వారా వచ్చాయి. ఈ సీట్లను ప్రవేశాల కౌన్సెలింగ్‌లో చేర్చలేదు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మహారాజా వైద్య కళాశాల నుంచి సీట్ల పెంపు కోసం అసలు దరఖాస్తులు రాలేదని ఎన్‌ఎంసీ ప్రకటించింది. గత రెండు వారాల నుంచి ఈ తతంగం కొనసాగుతోంది. రాష్ట్రానికి చెందిన ఈ మూడు కళాశాలలకు సంబంధించి మాత్రమే పీజీ సీట్ల కోసం నకిలీ ఎల్‌ఓపీల జారీ జరిగిందని ఎన్‌ఎంసీ వెల్లడించిందది.