తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలలో అధికార పార్టీ నేతల చేతివాటం బిఆర్ఎస్ ప్రభుత్వానికి తలవంపులు తెస్తుంది. దళిత బంధు, కుల వృత్తులు చేస్తున్నవారికి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ సందర్భంగా అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూళ్లు చేయడం ప్రభుత్వానికి, స్థానిక ప్రజా ప్రతినిధికి చెడ్డ పేరు తెస్తుంది.. ఎమ్మెల్యే రేగా కాంతారావు తాము ఏం చెప్తే అదే చేస్తాడంటూ బెదిరింపులకు పాల్పడడమే కాక తాము చెప్పకపోతే మీ పేర్లు లబ్ధిదారుల లిస్టులోకి ఎక్కవంటు ఒక్కొక్కరి వద్ద నుండి 20వేల నుండి లక్ష వరకు వసూళ్లకు పాల్పడుతున్నారనీ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.. బూర్గంపాడు, మణుగూరు మండలాలలో ఈ దందా ఎక్కువగా కొనసాగుతుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దందాకు సంబంధించి నిన్న రాత్రి ఓ మహిళ లబ్ధిదారు బూర్గంపాడు మండలంలోనీ ఓ యువ నాయకుడు చేస్తున్న వసూళ్ల పర్వం పై ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం, సదరు మహిళ మీడియా ముందు కూడా ఆ విషయాన్ని చెప్పిన వీడియోలు బయటికి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో మళ్ళీ రెచ్చిపోయిన ఆ యువ నాయకుడు తనపై ఫిర్యాదు చేసిన మహిళపై మరోసారి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం.. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న ఇలాంటి నాయకులపై ఎమ్మెల్యే రేగా కాంతారావు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.