ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత రెగ్యులర్ గా వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంది. ఆమె వేస్తున్న ప్రతి అడుగుపై మీడియా కన్ను ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కబోతోందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించిన సమంత ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. బాలి ట్రిప్ ను ముగించుకుని ఇటీవలే ఆమె ఇండియాకు వచ్చింది. న్యూయార్క్ లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలంటూ ఆమెకు ఆహ్వానం అందించి.
వరల్డ్ లార్జెస్ట్ డే పరేడ్ లో పాల్గొనాలని ఆమెను ఆహ్వానించారు. ఈ ఏడాది సమంతతో పాటు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఆహ్వానం అందింది. గతంలో ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రానా, అభిషేక్ బచ్చన్, అర్జున్ రాంపాల్, రవీనా టాండన్, తమన్నా, సన్నీడియోల్ తదితరులు హాజరయ్యారు. సమంతను ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అని అక్కడి వారందరూ సంబోధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతకున్న ఫాలోయింగ్ దృష్ట్యా 41వ వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌కి ఆమెను ఆహ్వానించారట. ఈ వేడుకల్లో సమంతతో పాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ కూడా పాల్గొనబోతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే… సామ్ నటించిన ‘ఖుషీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.