భారత యువ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా పారిస్ ఒలిపిక్స్ (2024) బెర్త్ దక్కించుకుంది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్‌లో ఐదో స్థానంలో నిలువడం ద్వారా.. సిఫ్ట్ కౌర్ విశ్వక్రీడలకు అర్హత సాధించింది. ఇటీవల ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన 21 ఏండ్ల సిఫ్ట్ కౌర్.. పారిస్ బెర్త్ దక్కించుకున్న ఆరో భారత షూటర్‌గా నిలిచింది.
ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అద్వితీయ ప్రదర్శనతో అలరించారు. రెండు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం సాధించడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ ఐదో బెర్త్‌ను ఖరారు చేశారు. తెలంగాణ షూటర్ ఇషా సింగ్, హరియాణా అమ్మాయిలు రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ బృందం మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం అందించింది. రిథమ్, ఇషా సింగ్, మనూ భాకర్ జట్టు 1,744 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
వ్యక్తిగత విభాగంలో రిథమ్ 583 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇషా సింగ్ 581 పాయింట్లతో 16వ స్థానంలో, మనూ 580 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రిథమ్ ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో అఖిల్ షెరాన్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం గెలిచింది.
భారత బృందం మొత్తం 1750 పాయింట్లు స్కోరు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లు స్కోరు చేసిన అఖిల్ ఐదో స్థానంతో ఫైనల్‌కు అర్హత పొందాడు. ఎనిమిది మంది మధ్య షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అఖిల్ 450 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ ఐదో బెర్త్‌ను అందించాడు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది.