దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా అంటూ సామాన్యులు సైతం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారత కోస్ట్ గార్డ్ వినూత్నంగా చేపట్టింది. ఈ వేడుకలను సెలబ్రెట్ చేసుకోవడానికి ఓ అరుదైన కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఉన్న సముద్రాన్ని వేదికగా చేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నీటి అడుగున చేపట్టింది ఇండియన్ కోస్ట్ గార్డ్. నీటి అడుగున మువ్వన్నెల జెండాను ఎగురవేసిన కోస్ట్ గార్డులు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
నీటి అడుగుభాగానికి ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను భారత కోస్ట్ గార్డ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ వీడియోను ఇప్పటి వరకు చాలా మంది చూశారు. దేశప్రజలకు గర్వకారణమంటూ కొందరు కామెంట్ చేస్తుంటే భారత్ మాతాకి జై అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.