కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన గౌస్ బాషా కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గౌస్‌బాషా రాజంపేటలోని ఎగువగడ్డలో ఉండే అవ్వాతాతల దగ్గర ఉన్నాడు.. అక్కడే ఉంటూ స్థానికంగా ఓ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత తన స్వగ్రామమైన మదనపల్లెకి వెళ్లాడు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి వివాహం చేసుకుని స్థిరపడ్డారు.
గౌస్‌బాషా కుటుంబం బెంగళూరు నుంచి కువైట్‌కి వెళ్లింది. ఈ క్రమంలో ఆయన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి కారులో వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. రోడ్డు ప్రమాదం జరిగింది వాస్తవమేనని.. మృతి చెందినట్లు చెబుతున్న వ్యక్తికి ఫోన్ చేస్తే అందుబాటులోకి రావడం లేదని గౌస్‌బాషా బంధువులు చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని.. వారి మృతదేహాలను చూసే వరకు నిర్ధారించలేమని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.