వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత ఇన్నింగ్స్ (44 బంతుల్లో 83, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)కు తోడు ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ (37 బంతుల్లో 49 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి నిలకడైన ఆటతో భారత్ మూడో టీ20లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో సిరీస్‌లో విండీస్ ఆధిక్యాన్ని భారత్.. 1-2కు తగ్గించింది.
160 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు మరోసారి ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి టెస్టులలో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ (1) ను తీసుకొచ్చినా అతడు తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బంతులే ఆడి అతడు ఒక్క పరుగు చేసిన అతడు.. మెక్‌కాయ్ వేసిన తొలి ఓవర్లోనే నాలుగో బంతికే భారీ షాట్ ఆడబోయి అల్జారీ జోసెఫ్ చేతికి చిక్కాడు. 11 బంతులాడిన శుభ్‌మన్ గిల్ ఆరు పరుగులే చేసి వైఫల్యాన్ని కొనసాగించాడు.
యశస్వి నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆదినుంచే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎదుర్కున్న తొలి రెండు బంతులను 4,6 గా మలిచిన సూర్య.. ఇన్నింగ్స్ ఆసాంతం ఇదే దూకుడు కొనసాగించాడు. గిల్ ఔటయ్యాక వచ్చిన తిలక్ వర్మతో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. తిలక్ కూడా పవర్ ప్లేలో దూకుడుగా ఆడాడు. తొలి రెండు బంతులను బౌండరీకి తరలించిన అతడు.. ఆ తర్వాత సూర్యకు అండగా నిలిచాడు. ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన ఆరో ఓవర్లో సూర్య 4, 6 బాదగా తిలక్ కూడా బౌండరీ బాదాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.
పవర్ ప్లే ముగిశాక కూడా ఈ ఇద్దరూ జోరు కొనసాగించారు. రొమారియా షెపర్డ్ వేసిన 8వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదిన సూర్య.. 23 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేకున్నాడు. అతడే వేసిన పదో ఓవర్లో 6,4 కొట్టి భారత స్కోరును వంద పరుగులకు చేర్చాడు. సూర్య ధాటిగా ఆడటంతో తిలక్ నెమ్మదించి అతడికే స్ట్రైక్ రొటేట్ చేస్తూ బాధ్యతాయుతంగా ఆడాడు. 70లలోకి వచ్చాక సూర్య మరింత రెచ్చిపోయాడు. అప్పటికే చిన్నగా చినుకులు మొదలుకావడంతో ఆటకు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉండటంతో మ్యాచ్‌ను త్వరగా గించాలనే తొందర్లో దూకుడు పెంచాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 13వ ఓవర్లో రెండో బంతిని సిక్సర్‌గా మలిచి 80లలోకి చేరిన మిస్టర్ 360.. తర్వాత బంతికే ఫుల్ టాస్ బంతిని బ్యాక్ షాట్ ఆడబోయి ఫైన్ లెగ్ వద్ద ఉన్న బ్రాండన్ కింగ్ చేతికి చిక్కాడు. కానీ అప్పటికే భారత్ విజయం దాదాపు ఖాయమైంది. మూడో వికెట్‌కు సూర్య- తిలక్‌లు 87 పరుగులు జోడించారు.
సూర్య స్థానంలో వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (15 బంతుల్లో 20 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్).. తిలక్ వర్మతో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. షెపర్డ్ వేసిన 16వ ఓవర్లో తిలక్ వర్మ భారీ సిక్సర్ బాదగా.. చివరి బంతికి పాండ్యా ఫోర్ కొట్టాడు. పావెల్ వేసిన 18వ ఓవర్లో ఐదో బంతికి హార్ధిక్ సిక్సర్ బాది భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు.
అంతకుముందు వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (42), కెప్టెన్ రోవ్మన్ పావెల్ (40 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో నాలుగో టీ20 ఈనెల 12 (శనివారం) ఫ్లోరిడా (అమెరికా)లో జరుగుతుంది.