కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. మన దేశం పేరును ‘ఇండియా'(INDIA) నుంచి ‘భారత్'(BHARATH)గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీ(DELHI)లో జీ20 సమ్మిట్(G20) జరగబోతున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో జీ20 దేశాధినేతలకు భారత(INDIA) రాష్ట్రపతి(PRESIDENT) ద్రౌపది(DRAUPADI MURMU) ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను పంపించింది. అయితే ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు(PRESIDENT OF INDIA) బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'(PRESIDENT OF BHARATH) అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమయింది.
మరోవైపు ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల(5 DAYS) పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల అజెండా ఏమిటనేది ఇంతవరకు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో… ఇండియా పేరును భారత్ గా మార్చేందుకే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. విపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కూటమిపై బీజేపీ నిప్పులు చెరిగింది. దేశం పేరు ఎలా పెట్టుకుంటారంటూ బీజపీ నేతలు మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక పెను దుమారానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే 2016లో సుప్రీం కోర్టు(SUPREME COURT) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పౌరులు దేశాన్ని.. ఇండియా లేదంటే భారత్ అని తమకు నచ్చిన విధంగా పిలుచుకోవచ్చని 2016లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ పేర్లకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిల్ దాఖలు కాగా.. దానిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది.అధికారిక, అనధికారిక కార్యక్రమాలలో భారత్ పేరును ఉపయోగించేలా దేశంలో ఉన్న ఎన్జీఓలు, ఇతర కార్పొరేట్ కంపెనీలకు ఆదేశాలివ్వాలని కోరుతూ.. మహారాష్ట్రకు చెందిన నిరంజన్ భట్వాల్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో ఓ పిల్ దాఖలు చేశాడు. భారత్, హిందుస్థాన్, హింద్, భరత భూమి, భరత వర్ష వంటి పేర్లు దేశానికి పెట్టాలని రాజ్యాంగ సభ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయని పిటిషనర్ గుర్తు చేశాడు.దీనిపై విచారణ చేపట్టిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ యు యు లలిత్‌తో కూడిన బెంచ్.. “భారత్ లేదంటే ఇండియా. మీకు భారత్ అని పిలవాలనుంటే అలాగే పిలవండి. మరో వ్యక్తికి ఇండియా అనాలని ఉంటుంది. అతడ్ని అలాగే అననివ్వండి.” అంటూ పిల్‌ను కొట్టివేస్తూ వ్యాఖ్యానించింది. కాగా ఇండియాకు బదులుగా దేశాన్ని భారత్ అని పిలవాల్సిన అవసరం లేదని 2015 నవంబర్‌లో సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1)(ARTICLE 1) ప్రకారం.. ఇండియా అంటే భారత్ అని, అది రాష్ట్రాల యూనియన్‌గా ఉండాలని పేర్కొంది.