ఆసియా కప్ -2023 కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెగా ఈవెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆసియాకప్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. మరోవైపు గాయం నుంచి కోలుకుని ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్న బుమ్రాకు కూడా జట్టులో అవకాశం దక్కింది. ఢిల్లీలో జరిగిన సలెక్షన్ కమిటీ సమావేశంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీంను ఎంపిక చేసింది. జట్టులో హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ సంజూ శాంసన్ ను రిజర్వ్ ప్లేయర్ గా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. తిలక్ వర్మకు ఆసియా కప్ 2023లో చోటు దక్కడంతో తెలుగు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆసియా కప్ 2023 కోసం జట్టును ఖారారు చేశారు. ఈ సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నారు. ఆసియా కప్ 2023కి శ్రీలంక, పాకిస్తాన్‌ల వేదికలు కాగా.. హైబ్రిడ్ మోడల్‌లలో టోర్నీ జరగనుంది. ఆగస్టు 30న పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. పల్లెకెలె వేదికగా సెప్టెంబర్ 2న భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్‌తో ఆడనుంది.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.