పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దులను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని వ్యూహాత్మక శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద.. అధునాతన మిగ్-29 యుద్ధ విమానాలను మోహరించింది. ఇప్పటివరకు ఈ ఎయిర్‌బేస్‌లో ‘మిగ్-21’ స్క్వాడ్రన్ విధులు నిర్వహించింది. ఇప్పుడు వాటి స్థానంలో మిగ్-29 యుద్ధ విమానాలను భారత వాయుసేన దింపింది. ఈ మిగ్-9 స్క్వాడ్రన్‌ను ‘డిఫెండర్ ఆఫ్ ది నార్త్’గా పిలుస్తారు. ఈ స్క్వాడ్రన్ చైనా, పాక్ నుంచి వచ్చే ముప్పును సమర్థంగా అడ్డుకోగలదని వాయుసేన దళాలు చెబుతున్నాయి. ‘కశ్మీర్ లోయ మధ్యలో శ్రీనగర్ ఉంటుంది. మైదానాల కంటే ఎత్తులో ఉంటుంది. సరిహద్దులకు సమీపంలో ఉండే ఎయిర్‌బేస్‌ల్లో వేగంగా స్పందించే విమానాలను మోహరించడం ఉత్తమం. అవి దీర్ఘశ్రేణి క్షిపణులను మోసుకెళ్లేవైతే మరింత వ్యూహాత్మకంగా ఉంటుంది. మిగ్-29కు ఈ సామర్థ్యాలన్నీ ఉన్నాయి. రెండువైపులా ముప్పులను ఈ విమానాలు ఎదుర్కోగలవు’ అని భారత వాయుసేన పైలట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ వెల్లడించారు.
సరిహద్దుల్లో శత్రుదేశాల నుంచి ముప్పు ఎదురైనప్పుడు.. యుద్ధ క్షేత్రాల్లో ఫస్ట్ రెస్పాండర్స్‌గా ఈ మిగ్ ఫైటర జెట్లను వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ పని కశ్మీర్ లోయలో గత కొన్నేళ్లుగా మిగ్-21లు చేస్తున్నాయి. 2019లో బాలాకోట్‌లోని పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేపట్టింది. ఆ తర్వాత.. పాకిస్థాన్ మనపైకి ఎఫ్-16తో దూసుకొచ్చింది. అప్పుడు మిగ్-21 వేగంగా వెళ్లి దాన్ని కూల్చేసింది. అయితే, ప్రస్తుతం మిగ్-21లను దశలవారీగా ఉపసంహరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో మిగ్-29ను మోహరించింది భారత్. అయితే మిగ్-21తో పోలిస్తే.. ఈ కొత్త మిగ్-29లో అత్యాధునిక ఫీచర్లున్నాయి. ఇవి దీర్ఘ శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్, ఎయిర్-టు-గ్రౌండ్ క్షిపణులను మోసుకెళ్లగలవు. అంతే కాకుండా, వీటిల్లో ఉండే నైట్ విజన్ గాగుల్స్ ఫీచర్‌తో.. చిమ్మచీకట్లోనూ వీటిని ఉపయోగించొచ్చు. ఇక గాల్లోనే ఇంధనం నింపే సామర్థ్యం ఈ అధునాతన మిగ్-29 ఉండటం వల్ల.. సుదీర్ఘ దూరానికి పంపించొచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలోనే వీటిని శ్రీనగర్ ఎయిర్‌బేస్‌కు తరలించారు. ఈ మిగ్-29లను తాజాగా విధుల్లోకి మోహరించారు.